సైబర్ నేరగాళ్లతో అప్రమత్తం : ఎస్పీ శబరీష్

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తం :  ఎస్పీ శబరీష్

ములుగు, వెలుగు: సైబర్ నేరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నేరగల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ములుగు ఎస్పీ శబరీష్ సూచించారు. ములుగు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో శనివారం ఎస్పీ చేతుల మీదుగా సైబర్ హైజీన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో వివరాలతో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పాస్వర్డ్ లను తరచూ మార్చుతూ ఉండాలన్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో డేటా గోప్యత సెట్టింగ్స్ ఉపయోగించాలని సూచించారు.

అపరిచితులు పంపిన లింక్స్ లేదా వెబ్​సైట్​లలో పాప్ అప్స్ క్లిక్ చేయకూడదని, అపరిచిత వ్యక్తులకు మీ బ్యాంకు కార్డు సహా వ్యక్తిగత సమాచారం చెప్పొద్దని, అనుకోని విధంగా మోసపోతే వెంటనే 1930కి లేదా www.cybercrime.gov.in లో కంప్లైంట్ చేయాలని చెప్పారు. సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు సిబ్బంది వాల్ పోస్టర్లను ములుగులోని ప్రధాన కూడళ్లలో అంటించారు. కార్యక్రమంలో ములుగు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ సందీప్ రెడ్డి, డీఎస్పీ రవీందర్, ఇన్​స్పెక్టర్ యాసిన్, ములుగు సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్టాఫ్ జహుర్, ఉమా మహేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.