సైబర్ బాధితులకు రూ.85 కోట్లు రిఫండ్‌‌‌‌‌‌‌‌

సైబర్ బాధితులకు రూ.85  కోట్లు రిఫండ్‌‌‌‌‌‌‌‌
  •     6,449 కేసుల్లో ఊరట
  •     సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్  వెల్లడి
  •     మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచన

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నేరగాళ్లకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌‌‌‌‌‌‌బీ) చెక్  పెడుతోంది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో కేటుగాళ్లు కొట్టేసిన డబ్బును ఫ్రీజ్  చేసి బాధితులకు రిఫండ్  చేస్తున్నది. ఈ ఏడాది మార్చి నుంచి జులై వరకు రూ.85.05 కోట్లను బాధితులకు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 6,449 కేసుల్లో ఫ్రీజ్  చేసిన డబ్బును తిరిగి చేర్చింది. ఇందులో అత్యధికంగా సైబరాబాద్  కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల్లో రూ.36.80 కోట్లను బాధితులకు అందించామని సైబర్  సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్  శిఖా గోయల్‌‌‌‌‌‌‌‌  సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నేరాలకు గురైన బాధితుడు వెంటనే 1930కి కాల్‌‌‌‌‌‌‌‌  చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. సైబర్  నేరస్తులు కాజేసిన డబ్బును తెలంగాణ సైబర్‌‌‌‌‌‌‌‌  సెక్యూరిటీ బ్యూరో, టీజీ లీగల్‌‌‌‌‌‌‌‌  సర్వీసెస్‌‌‌‌‌‌‌‌  అథారిటీస్‌‌‌‌‌‌‌‌  అధికారుల సమన్వయంతో ఫ్రీజ్  చేశామని ఆమె తెలిపారు. మొత్తం 6,840 కేసులను కోర్టుల్లో నమోదు చేయగా.. వాటిలో 6,449 కేసులకు సంబంధించి రిఫండ్   జరిగిందని చెప్పారు. సైబర్‌‌‌‌‌‌‌‌  మోసాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. ప్రతి కేసులోనూ అనుసరించాల్సిన వ్యూహాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు సమయానుకూలంగా చర్యలు తీసుకుని డబ్బును ఫ్రీజ్‌‌‌‌‌‌‌‌  చేసి బాధితులకు రిఫండ్  చేస్తున్నామని వెల్లడించారు.