- ఆటో డ్రైవర్ల పేర్లతో కరెంట్ అకౌంట్స్ ఓపెన్.. రూ.175 కోట్ల లావాదేవీలు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా నమోదైన 600 సైబర్ నేరాల్లో రూ.175 కోట్లు డిపాజిట్స్ కొట్టేసిన కేసులో హైదరాబాద్, శంషీర్‌గంజ్ ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ గాలి మధుబాబు(49)ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసేందుకు సహకరించిన కేపీహెచ్‌బీకి చెందిన జిమ్ ట్రైనర్ సందీప్ శర్మ ఉపధ్య(34)ను కూడా అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
దుబాయి అడ్డాగా సైబర్ నేరగాళ్లు కొట్టేసిన రూ.175 కోట్లు.. శంషీర్‌గంజ్‌లో ఎస్‌బీఐలోని ఆరు అకౌంట్స్‌లో డిపాజిట్ అయిన సంగతి తెలిసిందే. అకౌంట్స్ ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్లకు అందించిన విజయనగర్ కాలనీకి చెందిన మహ్మద్ షోయెబ్ తఖ్వీర్, మొగల్‌పురాకు చెందిన మహ్మద్ బిన్ అహ్మద్ బవాజీర్‌లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. అకౌంట్స్‌లో నిల్వ ఉన్న రూ.50 లక్షలను ఫ్రీజ్ చేశారు.
ఆరు అకౌంట్స్‌లో రూ.175 కోట్లు
కమీషన్ ఆశ చూపి ఇద్దరు ఆటో డ్రైవర్లు సహా మొత్తం ఆరుగురి పేర్లతో కరెంట్ అకౌంట్స్‌ను ఓపెన్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కరెంట్ ఖాతాలను తెరిచేందుకు బ్యాంక్ మేనేజర్ మధుబాబు, జిమ్ ట్రైనర్ సందీప్ శర్మ సహకరించినట్లు ఆధారాలు సేకరించారు. ఈ అకౌంట్స్‌లో మార్చి, ఏప్రిల్ నెలల్లో రూ.175 కోట్లు లావాదేవీలు జరిగాయి.
దేశవ్యాప్తంగా 600 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులు కోల్పోయిన డబ్బు శంషీర్‌గంజ్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో డిపాజిట్ అయినట్లు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్‌సీఆర్‌పీ) ద్వారా గుర్తించారు. ఈ మేరకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్‌పీ దేవేందర్ సింగ్ ఆధ్వర్యంలో సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఒకే అకౌంట్‌లో రూ.164 కోట్లు
ఆరు బ్యాంకు ఖాతాల్లో రూ.175 కోట్లు డిపాజిట్ అయ్యాయని అధికారులు గుర్తించారు. ఒక దాంట్లో రూ.50 లక్షలు ఉండగా.. మరో అకౌంట్లో అత్యధికంగా రూ.164 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఈ డబ్బులు క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో దుబాయికి తరలించినట్లు గుర్తించారు.