మల్టీ లెవల్ మోసాలపై జాగ్రత .. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచనలు

మల్టీ లెవల్ మోసాలపై జాగ్రత .. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచనలు

హైదరాబాద్‌, వెలుగు: మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ మోసాలపై అలర్ట్​గా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. వ్యవసాయ ఉత్పత్తులు, హెర్బల్‌, హెల్త్‌ కేర్‌‌, ఇతర గృహోపకరణాల మార్కెటింగ్‌ పేరుతో కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయని బ్యూరో డైరెక్టర్‌‌ శిఖాగోయల్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ.. రాష్ట్రంలో మళ్లీ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ మోసాలు (పిరమిడ్‌ మోసాలు) మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపారు. గొలుసుకట్టుగా అమాయకులకు వల వేస్తున్నారని హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీని అమ్మడం ద్వారా లాభాలు పొందవచ్చని ఆశ చూపుతున్నారన్నారు. 

ఇందుకోసం సైబర్‌ మోసగాళ్లు వాట్సాప్‌, టెలీగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద మెసేజ్‌లు, మోసపూరిత ప్రకటనలపై వెంటనే సైబర్‌ క్రైం హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 1930, వాట్సప్‌ నంబర్‌ 8712672222లో ఫిర్యాదు చేయాలన్నారు. ఈ తరహా మోసాల బారిన పడకుండా, ఒకవేళ సైబర్‌ మోసగాళ్లకు చిక్కితే ఎలా బయటపడాలన్న విషయాలపై టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పలు సూచనలు చేశారు.

  • లగ్జరీ కార్లు, ఫారిన్‌ టూర్లు, అత్యధిక లాభాలు అని ప్రకటనల్లో ఊదరగొడితే అది పక్కా మోసమని గుర్తించాలి. 
  • మీకు వచ్చే ప్రకటనల్లో ఉన్న కంపెనీల పేర్లు, వాటికి వ్యాపారం గురించి గుడ్డిగా నమ్మకుండా పూర్తి వివరాలు తెలుసుకోవాలి. 
  • మల్టీలెవల్‌ మార్కెటింగ్‌లో ఒకరి ద్వారా మరొకరు చేరుతుంటారు. ఇలాంటి చైన్‌లలో చేరవద్దు. 
  • ఆయా కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు వెళ్లొద్దు. 
  • మేసేజ్​ల్లో వచ్చే అనుమానాస్పద వెబ్‌ లింక్‌లు, ఏపీకే ఫైల్స్‌పై క్లిక్‌ చేయవద్దు
  • మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ స్కీంలు నడిపే  నిందితులు విదేశాల్లో ఉండి మోసగిస్తారు. 
  •  ఈ స్కీమ్​ లో తొలుత చేరిన కొద్ది మందికి లాభాలు చూపించి, మిగిలిన అందరి సొమ్ము కొల్లగొట్టేస్తారు.