పెట్టుబడుల ఆకర్షణలో శాంతిభద్రతలు కీలకం : డీజీపీ జితేందర్

పెట్టుబడుల ఆకర్షణలో శాంతిభద్రతలు కీలకం : డీజీపీ జితేందర్

హైదరాబాద్​ సిటీ , వెలుగు: రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు చాలా ముఖ్యమని.. వాటిని ఆకర్శించడంలో శాంతిభద్రతలు కీలక పాత్ర పోషిస్తాయని డీజీపీ జితేందర్ అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సైబరాబాద్ పోలీస్ 7వ వార్షిక క్రీడలు అండ్ డ్యూటీ మీట్–2025 శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్ చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. సీపీ ఆఫీస్ ఆవరణలో “మై స్కూల్ ఇటలీ” క్రెచ్‌‌‌‌ను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతితో కలిసి ఆయన ప్రారంభించారు. తర్వాత బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ కోర్టులను ఓపెన్ చేశారు. అనంతరం పురుషుల 100 మీటర్ల పరుగు పందెంను జెండా ఊపి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడారు. ‘‘రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే శాంతిభద్రతల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంది. ఓ వైపు శాంతిభద్రతలను కాపాడుతూనే.. ఆటల పోటీల్లో పాల్గొనడం అందరిలో కొత్త ఉత్సాహం తీసుకొస్తది. క్రీడలు.. పని ఒత్తిడిని తగ్గిస్తాయి. శారీరకంగా, మానసికంగా దృఢంగా చేస్తాయి. ఓర్పును పెంచుతాయి. నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి’’అని డీజీపీ జితేందర్ అన్నారు. 

వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఫిజికల్ ఫిట్​నెస్ ఎంతో ముఖ్యమని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి రోజూ వ్యాయామం చేయాలని సూచించారు. అనంతరం వివిధ క్రీడల్లో గెలిచిన అధికారులు, సిబ్బందికి డీజీపీ, సీపీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ, డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్​స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.