‘గ్రేటర్’లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు

గ్రేటర్ హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయ్యింది. 13 మంది నిందితులు గల అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుల వద్ద నుంచి రూ.30 లక్షల 68 వేల నకిలీ కరెన్సీ, రూ.60 వేల నగదు(ఒరిజినల్),13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. 

రెండు నెలల క్రితం నకిలీ కరెన్సీపై తమకు వచ్చిన ఫిర్యాదుతో దృష్టి పెట్టామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఎక్కడి నుండి ఈ నకిలీ కరెన్సీ వస్తుంది..? దీన్ని ఎవరు తయారు చేస్తున్నారనే కోణాల్లో విచారణ చేపట్టామన్నారు. తమ ఇన్వెస్ట్ గేషన్ లో అంతరాష్ట్ర ముఠా నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్లు గుర్తించి.. 13 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. 

ప్రధాన నిందితుడు రాజేష్ పై గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో ఈ ముఠా తమ కార్యకలాపాలను కొనసాగిస్తోందన్నారు. చెన్నై, బెంగళూరు, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల నుంచి నకిలీ కరెన్సీని తీసుకువస్తున్నారని తెలిపారు. రాజేష్, నీల్ దాస్ అనే ఇద్దరు ఒక లక్షకు రూ.5 లక్షల నకిలీ కరెన్సీ తెచ్చేవారని చెప్పారు. పలు నగరాల్లో రాజేష్, నీల్ దాస్ ఇద్దరు 1 లక్షకు రూ.3లక్షల నకిలీ కరెన్సీ సప్లై చేసేవారన్నారు. ఉదయం సమయాల్లో కాకుండా కేవలం రాత్రుల్లో మాత్రమే నకిలీ కరెన్సీని చలామణి చేసేవారని చెప్పారు.

తమకు అందిన పక్కా సమాచారంతో 13 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఫేక్ కరెన్సీని మార్చడానికి వైన్స్, పాన్ షాప్ లు, చిల్లర కొట్టు దుకాణాలే ఈ అంతరాష్ట్ర ముఠా టార్గెట్అని వెల్లడించారు. చదువుకోలేని అమాయకులను లక్ష్యంగా చేసుకుని..నకిలీ కరెన్సీని చలామణి చేసేవారని తెలిపారు.