రూ.2.81 కోట్ల విలువైన 800 కిలోల గంజాయి స్వాధీనం

రూ.2.81 కోట్ల విలువైన 800 కిలోల గంజాయి స్వాధీనం
  • కంటైనర్​ డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న సైబరాబాద్  పోలీసులు
  • ఒడిశా నుంచి హైదరాబాద్​మీదుగా మహరాష్ట్రకు స్మగ్లింగ్
  • ఐదుగురు అరెస్ట్..  పరారీలో ప్రధాన సప్లయర్, రిసీవర్

గచ్చిబౌలి, వెలుగు : ఒడిశా నుంచి హైదరాబాద్  మీదుగా మహారాష్ట్రకు కంటైనర్​ డీసీఎంలో తరలిస్తున్న 803 కిలోల గంజాయిని సైబరాబాద్ ​ పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాలను ఆదివారం గచ్చిబౌలిలోని కమిషనరేట్​ కార్యాలయంలో  ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్,​ శంషాబాద్​ డీసీపీ రాజేశ్​ వెల్లడించారు. ఒడిశాలోని మల్కాజిగిరి చిత్రగుండ మండలం కెందుగుగా గ్రామానికి చెందిన సోమనాథ ఖరా(34) గంజాయి స్మగ్లింగ్  దందా చేస్తున్నాడు. కర్నాటకకు చెందిన  సంజీవ్​ విఠల్​రెడ్డి (డీసీఎం కంటైనర్​ డ్రైవర్​కం ఓనర్) తో సోమనాథకు పరిచయం ఏర్పడింది.

సంజీవ్​తో ఒడిశా నుంచి  హైదరాబాద్​ మీదుగా మహరాష్ట్రకు గంజాయి రవాణా చేసేందుకు సోమనాథ రూ.2 లక్షలకు డీల్​ కుదుర్చుకున్నాడు. గత నెల 30న సంజీవ్ కు పటాన్​చెరు నుంచి విశాఖపట్నంకు ఫుడ్​ ఐటమ్స్​ డెలివరీ ఆర్డర్​ వచ్చింది. పటాన్​చెరులో సరుకు లోడ్​ చేసుకొని తన డ్రైవర్​ సంజీవ్​కుమార్​ హొళ్లప్పను తీసుకొని సంజీవ్  విశాఖపట్నం వెళ్లాడు. గాజువాకలో సరుకు డెలివరీ చేసి సోమనాథను సంప్రదించాడు. విశాఖలో గంజాయిని లోడ్​ చేసుకొని హైదరాబాద్​ శివారు పటాన్​చెరు వద్ద నవీ ముంబైకు సురేష్​ మారుతి పాటిల్ కు అందజేయాలని సంజీవ్ కు సోమనాథ తెలిపాడు.

ఈనెల 1న సంజీవ్ తన డీసీఎంలో విశాఖలో కెమికల్​ సాల్వెంట్​ డ్రమ్ములను లోడ్  చేసుకున్నాడు. తర్వాత సోమనాథ తన ఫ్రెండ్స్​ జగ సునా (26), సునీల్​ ఖోస్లా (28) డ్రైవర్​తో కలిసి ఓ కారును అద్దెకు తీసుకున్నాడు. విశాఖ నుంచి విజయనగరం గొట్లాం ప్రాంతానికి వెళ్లి 26  గన్నీ బ్యాగుల గంజాయిని తీసుకొని సంజీవ్ కు అప్పగించాడు. సంజీవ్  ఆ బ్యాగులు లోడ్​ చేసుకుని డ్రైవర్  హొళ్లప్పతో బయల్దేరాడు. వారికి ఎస్కార్ట్​గా సోమనాథ, జగ సూన, సునీత్​ ఖోస్లా బయలుదేరారు. 

వాహన తనిఖీల్లో దొరికారు

బాలానగర్​ ఎస్ఓటీ పోలీసులు, శంషాబాద్​ పోలీసులు టీజీ న్యాబ్​ అధికారులు ఈనెల 3న పెద్ద గోల్కొండ ఔటర్​ రింగు రోడ్డు జంక్షన్​ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా డీసీఎం కంటైనర్​ను అదుపులోకి తీసుకున్నారు. చెక్  చేయగా కెమికల్​ సాల్వెంట్​ డ్రమ్ముల చాటున ఉంచిన 803 కిలోల గంజాయి దొరికింది. డ్రైవర్  సంజీవ్​ కుమార్​ హొళ్లప్ప, ఓనర్ ​ సంజీవ్​రెడ్డి, కమిషన్​ ఏజెంట్​ సోమనాథ ఖరా, సునీల్​ ఖోస్లా, జగ సునాను అరెస్టు​ చేశారు. గంజాయి విలువ రూ.2.81 కోట్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు.