దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ముఠాను సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోట్ల మంది డేటాను సేకరించి.. నిందితులు విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైన క్రమంలో ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లు వినియోగదారులకు బ్యాంకులు, సిమ్ కార్డుల పేరుతో మెసేజ్ లతో పాటు లింకులను పంపుతున్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింకులను తెలియక క్లిక్ చేసిన వారి వ్యక్తిగత డేటాను మొత్తం చోరీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
సంబంధం లేకపోయినా అనవసర సందేశాలు పంపుతూ దేశవ్యాప్తంగా కోట్ల మంది డేటాను చోరీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి సందేశాలపై ప్రతిఒక్కరూ అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను ఇప్పటికే చోరీ చేసినట్లు గుర్తించారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్ ను కొట్టేసినట్లు విచారణలో తేల్చారు. కోట్ల మంది వ్యక్తిగత డేటాను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేశారని తెలుస్తోంది.
ఇన్‌కాగ్ని సంస్థ నివేదికలో ఏముంది..?
దేశవ్యాప్తంగా కోటి 80 లక్షల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైనట్టు తాజా సర్వే తెలిపింది. ఈ డాటా గత 20 ఏండ్లలో 10 సందర్భాల్లో డేటా చోరీ జరిగిందని ఇన్‌కాగ్ని సంస్థ వెల్లడించింది. డేటా చోరీ బాధిత టాప్-5 దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని వివరించింది. అమెరికాలో 20.7 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైందని ఇన్‌కాగ్ని పేర్కొంది. భారత్ తర్వాత యూకే, బ్రెజిల్, కెనడా దేశాల్లో వ్యక్తిగత డేటా చోరీ ఎక్కువగా జరిగిందని స్పష్టం చేసింది.