- 5 లక్షల విలువైన
- 8 తులాల బంగారం స్వాధీనం
గచ్చిబౌలి, వెలుగు: ఈ నెల 13న సైబరాబాద్, సంగారెడ్డి పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన కేసులో నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఏడీసీపీ నర్సింహా రెడ్డి వివరాలు వెల్లడించారు. ముంబయికి చెందిన తన్వీర్ఖాన్(34) సంగారెడ్డికి వచ్చి అక్కడే సెటిల్ అయ్యాడు. స్థానికంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నాడు.
తన్వీర్ ఫ్రెండ్స్ ముంబయికి చెందిన అమ్జద్ ఇక్బాల్ షేక్(36), షౌకత్ హుస్సేన్(34) ఇద్దరూ పాత నేరస్తులు. సిటీలో చైన్ స్నాచింగ్ లకు స్కెచ్ వేసిన తన్వీర్ తన ఫ్రెండ్స్ ను ముంబయి నుంచి సంగారెడ్డికి రప్పించాడు. ఈ నెల 13న తన్వీర్ తన స్కూటీపై తన ఫ్రెండ్స్ తో కలిసి ఆర్సీపురం వచ్చాడు. వారిని అక్కడ డ్రాప్ చేసి తిరిగి ఒక్కడే సంగారెడ్డికి వెళ్లిపోయాడు.
ఉదయం 11.30 గంటల నుండి రాత్రి 7.30 వరకు...
అమ్జద్ ఇక్బాల్, షౌకత్ హుస్సేన్ ఉదయం 11.30 గంటలకు ఆర్సీపురంలోని శ్రీనివాసనగర్ లో ఓ బైక్ ను దొంగిలించారు. దానిపై మియాపూర్ లోని దీప్తిశ్రీనగర్కు వెళ్లారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఓ మహిళ మెడలోని బంగారాన్ని కొట్టేసేందుకు యత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత చందానగర్ లోని హుడా ట్రేడ్ సెంటర్ కి వెళ్లారు. 1.15 గంటలకు సుబ్బరత్నమ్మ అనే వృద్ధురాలి మెడలోని 5 తులాల బంగారు పుస్తెలతాడను తెంపుకెళ్లారు. చందానగర్ మీదుగా సంగారెడ్డికి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటలకు సంగారెడ్డిలో చైన్ స్నాచింగ్ కు యత్నించారు.
రాత్రి 7.30 గంటలకు మళ్లీ మియాపూర్ కు వచ్చారు. డీమార్ట్ దగ్గరలో ఇంటికి వెళ్తున్న ఓ మహిళ మెడలోని 2.5 తులాల గొలుసును లాక్కెళ్లారు. ఆ తర్వాత సంగారెడ్డికి చేరుకుని బైక్ ను అక్కడే వదిలేసి ముంబయికి పారిపోయారు. కొట్టేసిన బంగారాన్ని అమ్జద్, షౌకత్.. తన్వీర్ కు అప్పగించారు. తన్వీర్ ఆ బంగారాన్ని థానెలోని ఇంద్రలోక్ ప్రాంతానికి చెందిన విజయ్ కమల్ కాంత్ యాదవ్ కు అమ్మేశాడు. బైక్ చోరీ, వరుస చైన్ స్నాచింగ్ ఘటనలపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన ఆర్సీపురం, చందానగర్, మియాపూర్ పోలీసులు కేసులు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానించి నిందితుల కోసం గాలించారు.
మాదాపూర్ జోన్ సీసీఎస్, చందానగర్, మియాపూర్, ఆర్సీపురం పోలీసులు స్పెషల్ టీమ్స్ గా ఏర్పడి సీసీ కెమెరాల ఫుటేజ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డిలో తన్వీర్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో అమ్జద్ ఇక్బాల్, షౌకత్ హుస్సేన్, విజయ్కమల్ కాంత్ ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పల్సర్ బైక్, స్కూటీ, రూ.5 లక్షల విలువైన 5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో పట్టుబడ్డ నలుగురు నిందితులు పాత నేరస్తులేనని డీసీపీ తెలిపారు. అమ్జద్ పై 14 కేసులున్నాయని,హుస్సేన్, విజయ్ మర్డర్ కేసులో నిందితులని ఆమె వివరించారు. తన్వీర్ పై అఫ్జల్ గంజ్ పీఎస్ లో కేసు ఉందన్నారు.