- మధ్యప్రదేశ్ నుంచి వచ్చి సిటీలో చోరీలు చేస్తున్న ముఠాలు అరెస్ట్
- 6 కత్తులు, రెండు సెట్ల కట్టర్లు, రూ.11,500 క్యాష్ స్వాధీనం..
గచ్చిబౌలి, వెలుగు : దొంగతనాలను చేసే ముందు సొంతూరిలో దేవుళ్లకు మొక్కి వచ్చి, సిటీలో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నర్సింహా మంగళవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ అఫీస్‌లో మీడియాకు వివరాల వెళ్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లాకు చెందిన కరణ్ మనోహర్ బాబర్(23), ప్యార్‌సింగ్ బావులా(27), ధేబ్రా బావులా(27) ఒక గ్యాంగ్‌గా.. కడక్ సింగ్(38), చెందిన ఠాకూర్ ఎడియా(30), కుమన్ ఎడియా(30) కలిసి మరో గ్యాంగ్‌గా ఏర్పడ్డారు.
మద్యం, పేకాట అలవాటు ఉన్న వీరు జల్సాల కోసం దొంగతనాలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సొంతూరు, చుట్టూపక్కల దొంగతనాలు చేస్తే అనుమానాలు వస్తాయని హైదరాబాద్వచ్చి చోరీలు ప్రారంభించారు. తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి, మధ్యాహ్నం రెక్కి చేసి, అర్ధరాత్రి తర్వాత పని కానిస్తారు. దొంగలించిన సొత్తుతో తిరిగి సొంతూరుకు వెళ్లి సమానంగా పంచుకుంటారు. కరణ్మనోహర్ బాబర్ గ్యాంగ్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని ఓ విల్లాలో దొంగతనం చేశారు.
కడక్ సింగ్ గ్యాంగ్ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ రెండు గ్యాంగులపై మియాపూర్, పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. మాదాపూర్ సీసీఎస్, బాలానగర్ సీసీఎస్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. ఈనెల 7న మియాపూర్‌లోని మక్తా వద్ద ముగ్గురిని, పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ వద్ద మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు ఒప్పుకున్నారు.
వీరి నుంచి 6 కత్తులు, రెండుసెట్ల కట్టర్లు, రూ.11,500 క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై మూడు కమిషనరేట్లతో పాటు సంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో 35 కేసులు ఉన్నాయి. రెండు గ్యాంగ్ సభ్యులు దొంగలించిన సొత్తును అమ్మిపెట్టే ఇద్దరు వ్యక్తులు రోహిత్సోని, గౌరవ్లతో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. దొంగతనాలు చేసే సమయంలో ఎవరైన అడ్డుపడితే చంపేందుకు కూడా వెనుకాడరని పేర్కొన్నారు.