- ఆరుగురు అరెస్ట్, పరారీలో ఐదుగురు
- 80 బైకులు, రెండు కార్లు స్వాధీనం
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ రోడ్లపై బైక్రేసింగ్స్ నిర్వహిస్తున్న యువకులపై సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో రేసింగ్కు పాల్పడ్డ 80 మంది రేసర్లపై 9 కేసులు నమోదు చేశారు. 80 బైకులు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు యువకులను అరెస్ట్ చేయగా, ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులకు సంబంధించిన వివరాలను మాదాపూర్ జోన్ ఏసీపీ శ్రీకాంత్ శుక్రవారం రాయదుర్గం పీఎస్లో వెల్లడించారు.‘సిటీలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు బైకులతో రాత్రిళ్లు ఐటీ కారిడార్లోని టీహబ్, నాలెడ్జ్సిటీ రోడ్లపైకి వస్తున్నారు. స్టంట్లు వేస్తూ.. రేసులు నిర్వహిస్తున్నారు. శని, ఆదివారాల్లో రోడ్లు ఖాళీగా ఉంటున్నాయి.
ఆ టైంలో ఎక్కువగా రేస్లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 1న రాత్రి 9 గంటలకు టీహబ్, నాలెడ్జ్సిటీ రోడ్లపై బైక్రేసులు జరుగుతున్నాయని సమాచారం అందడంతో అక్కడికి వెళ్లాం. పోలీసుల రాకను చూసిన రేసర్లు బైకులను అక్కడే వదిలి పారిపోయారు. ఘటనా స్థలంలో చిక్కిన 50 బైకులను స్వాధీనం చేసుకుని పీఎస్కు తరలించాం. విచారణలో మరో 30 బైకులు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నాం.
రేసింగ్ కు పాల్పడ్డ 80 మందిపై 9 కేసులు నమోదు చేశాం.’ అని ఏసీపీ తెలిపారు. రేసింగ్స్లో కీలకంగా వ్యవహరించిన ఆరుగురిని అరెస్ట్ చేశామని, ఐదుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇకపై విపరీతమైన శబ్ధాలతో స్టంట్లు వేసినా, రేసింగ్స్నిర్వహించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.