
- బయటి వ్యక్తులు రావొద్దన్న పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై పోలీసులు ఆంక్షలు విధించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర సాధికారత కమిటీ ఆదేశాల మేరకు మాదాపూర్ జోన్ డీసీపీ డా.జి. వినీత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో బయటి వ్యక్తులకు ప్రవేశం లేదని, సంబంధం లేని వ్యక్తులు ఈ భూమిలోకి ప్రవేశించడం నిషేధించినట్టు ఉత్తర్వులు ఇచ్చారు.
పోలీసుల ఆంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా, అల్లర్ల వంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరోధించడం కోసమే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు డీసీపీ వివరించారు. ఈ ఆంక్షలు ఈ నెల 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.