నెలలో మూడున్నర కోట్ల విలువైన 1100 ఫోన్లు రికవరీ

సైబరాబాద్/ హైద్రాబాద్, వెలుగు:
హైద్రాబాద్ మహానగరంలో కేటుగాళ్ల దొంగతనాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ దొంగతనాలకైతే లెక్కేలేదు. సైబరాబాద్ లో ఈ 3, 4 నెలల్లో కొట్టేసిన ఫోన్ల విలువ దాదాపు మూడున్నర కోట్లు అని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. తాజాగా రికవరీ చేసిన 11 వందల ఫోన్లను మంగళవారం (డిసెంబర్ 10, 2024) బాధితులకు అప్పగించారు పోలీసులు. వీటి విలువ 3 కోట్ల 30 లక్షలు ఉంటుందని సైబరాబాద్ డీసీపీ నర్సింహా తెలిపారు.

ఈ సందర్భంగా డీసీపీ నర్సింహా మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం 2023 ఏప్రిల్ 20న ప్రవేశపెట్టిన సిఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఈ వెబ్ సైట్ లో ఎక్కవ శాతం మొబైల్స్, ఇతర వస్తువులు పోగొట్టుకున్నామనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి నెల రోజులలోనే ఫోన్లను రికవరీ చేశామని అన్నారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ దాదాపు మూడున్నర కోట్లు ఉంటుందన్నారు. సైబరాబాద్ పరిధిలో 45 స్టేషన్లలో పోలీసులు కష్టపడి ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. పోలీసులు కలిసి పనిచేయడం వలన ఇన్ని ఫోన్లను రికవరీ చేయగలిగామని అన్నారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం7500 ఫోన్లు రికవరీ చేయగా అందులో 5500 ఫోన్లు ఈ సంవత్సరంలో చేసినవేనని అన్నారు. ఫోన్ల రికవరీలో సైబరాబాద్ 2వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.

Also Read :- ఫాంహౌస్లో మోహన్ బాబు పెదరాయుడి తీర్పులు


 సిఈఐఆర్ లో ఫిర్యాదు చేస్తే వీలైనత తొందరగా రికవరీ:


చోరీ కేసులకు సంబంధించి  సిఈఐఆర్ లో ఫిర్యాదు చేసుకునే సదుపాయం కల్పించామని, పోయిన వెంటనే ఈ వెబ్ సైట్ లో ఫిర్యాదు నమోదు చేసుకుంటే తక్కువ సయమంలోనే రికవరీ చేయడం జరుగుతుందని డీసీపీ తెలిపారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఫోన్ ట్రేస్ అవుతుందని, దీనివల్ల చాలా తొందరగా రికవరీ చేయడానికి సాధ్యమవుతుందని అన్నారు. 


నగరవాసులకు సూచనలు:


ఈ సందర్భంగా డీసీపీ నర్సింహా నగర వాసులకు పలు సూచనలు చేశారు.  విలువైన వస్తువులు తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలని, ప్రతి ఒక్కరు సీసీటీవీ లు అమర్చుకోవాలని, ఒక్క సీసీటీవీ వందమందితో సమానమని చెప్పారు. అదేవిధంగా దొంగతనాలకు పాల్పడేవారిపై నిత్యం నిఘా పెడతామని, సమాజంలో అసాంఘిక శక్తుల గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని సూచించారు. ఇటీవలి కాలంలో సైబర్ క్రైమ్ లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుందని, సైబర్ బారిన పడొద్దని సూచించారు. 

మన స్తోమత ఎంతో తెలుసుకొని ప్రవర్తించాలని, అత్యాశ సైబర్ క్రైమ్ కు దారి తీస్తుందని అన్నారు. బ్యాంకు అధికారులు, ఇతర తెలియని నెంబర్ ల నుండి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయాలని అన్నారు. మీకు కొరియర్ వచ్చిందదని, ఏవో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు వీడియో కాల్ చేసి బయపెడతారని,  అటువంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. అటువంటి పరిస్తితుల్లో ఎటువంటి భయం లేకుండ పోలీసులకు పిర్యాదు చేయాలని అన్నారు. మని కొందరు మీపై సిబిఐ కేసు అయ్యిందని, డిజిటల్ అరెస్ట్ చేస్తామని బయపెడతారని, అలాంటి వారి గురించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా ఆన్ లైన్ ఫ్రాడ్ విషయంలో చాలా జాగ్రత్ర వహించాలని సూచించారు.