కేటీఆర్​ బామ్మర్ది ఫామ్​హౌస్​లో దావత్​ కలకలం

కేటీఆర్​ బామ్మర్ది ఫామ్​హౌస్​లో దావత్​ కలకలం
  • పార్టీ ఏర్పాటు చేసిన రాజ్​ పాకాల.. పోలీసుల సోదాలు
  • దావత్​లో పాల్గొన్న వ్యాపారి విజయ్‌‌ మద్దూరికి డ్రగ్స్‌‌ పాజిటివ్‌‌
  • పరారీలో రాజ్​ పాకాల..  ఎన్‌‌డీపీఎస్  యాక్ట్‌‌ కింద కేసు
  • దావత్​కు 40 మందికిపైగా హాజరు
  • పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం
  • హాజరైనవాళ్లలో 22 మంది పురుషులు,18 మంది మహిళలు
  • భారీగా ఫారిన్​ లిక్కర్​, క్యాసినో కాయిన్స్​ స్వాధీనం
  • కేటీఆర్​ బామ్మర్ది రాజ్​ పాకాలనే కొకైన్​ ఇచ్చిండన్న విజయ్ 
  • కొకైన్​ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసుల విచారణ

హైదరాబాద్/చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌ బామ్మర్ది రాజ్  పాకాల ఫామ్​హౌస్​లో దావత్​ కలకలం రేపింది. జన్వాడలోని ఫామ్​హౌస్​లో శనివారం అర్ధరాత్రి రేవ్​ పార్టీ జరుగుతున్నదంటూ స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ  సోదాలు చేశారు. భారీగా లిక్కర్​ దొరికింది. ఇందులో 12  ఫారిన్ లిక్కర్‌‌‌‌ బాటిళ్లు కూడా ఉన్నాయి. క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్‌‌ కార్డ్స్​ కూడా పట్టుబడ్డాయి. 

పార్టీలో 40 మందికిపైగా పాల్గొన్నట్లు గుర్తించారు. 22 మందికి డ్రగ్స్​ ర్యాపిడ్‌‌ టెస్ట్‌‌లు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్‌‌ మద్దూరి డ్రగ్స్​ (కొకైన్)​ తీసుకున్నట్లు తేలింది. తనకు డ్రగ్స్​ను ఇచ్చింది రాజ్​ పాకాల అని పోలీసుల విచారణలో విజయ్​ మద్దూరి వెల్లడించాడు. తనకు డ్రగ్స్​ను ఇచ్చింది రాజ్​ పాకాల అని పోలీసుల విచారణలో విజయ్​ మద్దూరి వెల్లడించాడు. రాజ్​ పాకాల పరారీలో ఉన్నాడు. నార్కోటిక్​ డ్రగ్స్​ అండ్​ సైకోట్రోపిక్​ సబ్​స్టాన్సెస్​ (ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్) యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

టెస్టులకు సహకరించలే!

రంగారెడ్డి జిల్లా శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం జన్వాడ పరిధిలో కేటీఆర్‌‌‌‌‌‌‌‌ బామ్మర్ది  రాజ్‌‌‌‌‌‌‌‌ పాకాలకు 8 ఎకరాల్లో ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ ఉంది. రాజ్‌‌‌‌‌‌‌‌ పాకాల రెండు ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్నాడు. ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో వీకెండ్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర సమయాల్లో ఈవెంట్స్ జరుగుతుంటాయి. శనివారం రాత్రి ఆ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో రేవ్‌‌‌‌‌‌‌‌ పార్టీ జరుగుతున్నట్లు, భారీ శబ్దాలతో న్యూసెన్స్ చేస్తున్నట్లు రాత్రి 10.30 గంటల సమయంలో డయల్‌‌‌‌‌‌‌‌ 100కు కాల్​ వచ్చింది. దీంతో సైబరాబాద్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌వోటీ పోలీసులతో స్థానిక మోకిల పోలీసులు, ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ పోలీసులు రాత్రి 11.30 గంటల సమయంలో ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్​కు చేరుకున్నారు. 

పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో డాగ్‌‌‌‌‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌తో తనిఖీలు చేపట్టారు. పోలీసులు చేరుకున్న వెంటనే అక్కడున్న వారంతా అప్రమత్తమయ్యారు. పారిపోయేందుకు ప్రయత్నించారు. పార్టీలో 22 మంది పురుషులు,18 మంది మహిళలతో పాటు ఐదుగురు పిల్లలున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కో టేబుల్​దగ్గర నాలుగేసి కుర్చీల చొప్పున వేసి ఉన్నాయి. వాటి దగ్గర క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్‌‌‌‌‌‌‌‌ కార్డ్స్‌‌‌‌‌‌‌‌ కనిపించాయి. 

ఒక దగ్గర బార్​సెంటర్​పై లిక్కర్​బాటిల్స్​కనిపించాయి. అయితే, డ్రగ్స్ పార్టీ జరిగిందనే అనుమానంతో వారికి కిట్స్​తో టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేసేందుకు యత్నించగా సహకరించలేదు. మహిళలు ససేమిరా అనడంతో వారికి టెస్టులు చేయలేదు. మిగిలిన వారిపై పోలీసులు సీరియస్ కావడంతో అంగీకరించారు. 22 మందికి డ్రగ్స్​ రాపిడ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్‌‌‌‌‌‌‌‌ మద్దూరి  కొకైన్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నట్లు నిర్ధారణయింది. దీంతో విజయ్‌‌‌‌‌‌‌‌ను ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించి బ్లడ్ శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ తీసుకుని కన్ఫమ్​చేసుకున్నారు. తరువాత అదుపులోకి తీసుకుని విచారించారు. కొకైన్‌‌‌‌‌‌‌‌తో పాటు పార్టీకి సంబంధించిన వివరాలను సేకరించారు. పార్టీకి స్థానిక ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ అధికారులతో పాటు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని గుర్తించారు.

పరారీలో రాజ్​ పాకాల

కేటీఆర్​బామ్మర్ది రాజ్​ పాకాల పారీలో ఉన్నాడు. తనకు రాజ్​ పాకాల డ్రగ్స్​ఇచ్చి వాడమన్నాడని పోలీసుల విచారణలో విజయ్​ మద్దూరి స్పష్టం చేయడం సంచలనం సృష్టిస్తున్నది. రాజ్​కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అతడు పరారీలో ఉన్నాడని, ఫోన్​స్విచ్ఛాఫ్​చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.  ఫామ్​హౌస్​లో నిర్వహించిన సోదాల్లో  12  ఫారిన్ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్స్‌‌‌‌‌‌‌‌..  ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన రెండు నాన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్స్.. 11 కేఎఫ్‌‌‌‌‌‌‌‌ బీర్లు.. 7.35 లీటర్లు టీజీ ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ బాటిల్స్ ను పోలీసులు పట్టుకున్నారు. 

వీటితో పాటు పెద్ద మొత్తంలో క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్‌‌‌‌‌‌‌‌ కార్డ్స్‌‌‌‌‌‌‌‌ సీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కాగా, రాజ్​ పాకాల పరారీలో ఉండటంతో అతడికి చెందిన రాయదుర్గంలోని ఓరియన్​ విల్లాస్​కు ఆదివారం పోలీసులు వెళ్లారు.  40వ నంబర్​లోని రాజ్​ పాకాల​విల్లాతో పాటు ఆయన తమ్ముడు శైలేంద్రకు చెందిన 5వ నంబర్​ విల్లాలో సోదాలు చేశారు. సోదాలకు వచ్చిన సమయంలో రాజ్‌‌‌‌‌‌‌‌ పాకాల మొబైల్ స్విచ్చాఫ్‌‌‌‌‌‌‌‌లో ఉండడంతో కొద్దిసేపు ఎదురుచూశారు. తర్వాత విల్లా తాళాలు పగులగొట్టి సెర్చ్‌‌‌‌‌‌‌‌ చేశారు. శైలేంద్ర విల్లాలో సోదాలు జరిపారు.  

రాజ్​ పాకాల కంపెనీకి విజయ్​ సీఈవో

రాజ్​ పాకాల, విజయ్​ మద్దూరికి కొన్నేండ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ పాకాలకు రెండు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ కంపెనీలు ఉండగా.. ఇందులో నానక్​రాంగూడలోని ఈటీజీ కంపెనీకి సీఈఓగా విజయ్ మద్దూరి పనిచేస్తున్నాడు. అలాగే ఫ్యూజన్​ఏఐఎక్స్​అనే సాఫ్ట్​వేర్​కంపెనీకి విజయ్​ఓనర్​గా, సీఈవో గా ఉన్నాడు. 

రాజ్​కు కొకైన్​ఎక్కడి నుంచి  వచ్చిందో ఆరా తీస్తున్నం: డీసీపీ

ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో రేవ్‌‌‌‌‌‌‌‌ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో స్పెషల్ ఆపరేషన్ టీమ్‌‌‌‌‌‌‌‌ ద్వారా సెర్చ్​చేవామని, శనివారం రాత్రి 11.30 గంటలకు అక్కడికి వెళ్లామని రాజేంద్రనగర్​ డీసీపీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. ‘‘అక్కడున్న సీన్​ప్రకారం ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో లిక్కర్ పార్టీ జరుగుతుందని గుర్తించాం. అనుమానం వచ్చి పార్టీలో పాల్గొన్న వారికి ర్యాపిడ్​డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ టెస్ట్ నిర్వహించాం. 

ఇందులో విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్​తీసుకున్నట్టు తేలింది. ఉస్మానియాకు తరలించి అతడి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్​చేయించాం. తర్వాత విచారణ జరిపాం. అందులో రాజ్​పాకాల కొకైన్​ఇచ్చినట్టు విజయ్​వెల్లడించాడు. రాజ్​పాకాలకు కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. సప్లయ్ చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తాం. రాజ్‌‌‌‌‌‌‌‌ పాకాల అందుబాటులో లేడు. గాలిస్తున్నాం” అని ఆయన వివరించారు. 

ఏ1గా రాజ్​ పాకాల

ఎన్​డీపీఎస్​ యాక్ట్​, తెలంగాణ గేమింగ్ యాక్ట్  కింద కేటీఆర్​ బామ్మర్ది రాజ్​ పాకాల (50), విజయ్​ మద్దూరి (55), ఫామ్​హౌస్​ మేనేజర్​ కార్తీక్​(30)పై మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా రాజ్​పాకాల, ఏ2గా విజయ్​మద్దూరి, ఏ3గా కార్తీక్​ను చేర్చారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు, ఫారిన్​లిక్కర్​వాడినందుకు ఎక్సైజ్ యాక్ట్​ కింద కూడాకేసు ఫైల్​ చేశారు.

రాజ్‌‌‌‌‌‌‌‌  కొకైన్​ ఇచ్చిండు: విజయ్  ​

రాజ్​పాకాల తనకు కొకైన్​ ఇచ్చాడని విజయ్​మద్దూరి పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ నెల15న తాను నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇండియాకు వచ్చినట్లు అతడు వెల్లడించాడు. దీపావళి సందర్భంగా జన్వాడలోని రాజ్‌‌‌‌‌‌‌‌ పాకాల ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో శనివారం ఉదయం పూజలు నిర్వహించినట్లు తెలిపాడు. తర్వాత సాయంత్రం నుంచి పార్టీ ఏర్పాట్లు చేశారని వెల్లడించాడు. తన దగ్గరకు వచ్చిన రాజ్​కొకైన్​తీసుకుంటావా అని అడిగాడని, నెదర్లాండ్స్​లో ఉన్నప్పటి నుంచే తనకు డ్రగ్స్ అలవాటు ఉండడంతో రాజ్​నుంచి తీసుకుని యూజ్​చేసినట్టు విజయ్​ మద్దూరి పోలీసుల విచారణలో చెప్పాడు. మొదట డ్రగ్స్​ రాపిడ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌కు విజయ్‌‌‌‌‌‌‌‌ సహక రించలేదు. దాదాపు మూడు గంటల పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. చివరికి టెస్ట్​చేయగా కొకైన్​తీసుకున్నట్టు నిర్ధారణ అయింది.

కేటీఆర్​ సమాధానం చెప్పు

గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం రేవంత్​ ప్రయత్నిస్తుంటే మీ బామ్మర్ది ఫామ్​ హౌస్​లో డ్రగ్స్​ పార్టీలా..? కేటీఆర్​.. రాష్ట్రంతో పాటు యువతకు దీనిపై ఏం సమాధానం చెప్తవ్​? రేవ్ పార్టీలో ఎంతటి వారున్న ఊరుకునేది లేదు.  కేటీఆర్​ జైలుకెళ్లడం ఖాయం. ఆయన బామ్మర్ది రాజ్​పాకాల ఎంతో మందికి డ్రగ్స్ ​అలవాటు చేశాడు. వాళ్ల జీవితాలతో పాటు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేశాడు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్​ రెడ్డి వైట్ చాలెంజ్​కి సిద్ధమా? అని అంటే కేటీఆర్ ఎందుకు ముందుకురాలేదో చెప్పాలి.

ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్

డ్రగ్స్ స్టేట్ గా చేస్తున్నరు..  

కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల తన ఫామ్ హౌస్ లో డ్రగ్స్, విదేశీ మద్యంతో పార్టీ ఇచ్చాడు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, కేటీఆర్ అండ్ బ్యాచ్ మాత్రం రాష్ట్రాన్ని డ్రగ్స్ స్టేట్ గా చేస్తున్నది. ఈ పార్టీలో ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. ఎంతటివారైనా కఠినంగా శిక్షించాల్సిందే.  
- అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ 

గత బీఆర్ఎస్ పాలనంతా రేవ్ పార్టీలే.. 

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిందంతా రేవ్​పార్టీలే. యువతను మత్తుకు బానిసలు చేసిందే బీఆర్ఎస్. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ కోసం కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుంటే.. కేటీఆర్ బామ్మర్ది మళ్లీ డ్రగ్స్ వ్యవహారం నడిపిస్తున్నడు. ఇందులో కేసీఆర్ బంధువులు, కేటీఆర్ ఇంకా ఎంత పెద్దవారు ఉన్నా వదిలిపెట్టొద్దు. కఠినంగా శిక్షించాల్సిందే.

 శివసేనా రెడ్డి, శాట్ చైర్మన్

యువరాజులంతా డ్రగ్స్ తీసుకుంటున్నరు.. 

వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్  చుట్టుపక్కల ప్రాంతాల్లో రేవ్​పార్టీలని, రావుల పార్టీలని యువరాజులంతా ఒక్కచోట కూర్చొని డ్రగ్స్ తీసుకుంటున్నారు. జన్వాడా ఫామ్ హౌస్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ బయటపెట్టాలి. అక్కడి సీసీ ఫుటేజీని వెంటనే విడుదల చేయాలి. ఫామ్​హౌస్ లో జరిగిన పార్టీ రాజుదా? యువరాజుదా? రేవ్​పార్టీనా? రావుల పార్టీనా? డ్రగ్స్​ఉన్నాయా? ఫారిన్​లిక్కర్​ఉన్నదా? అన్న విషయం ప్రజలకు తెలియజేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి.

సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నరు.. 

కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్నది. ఓవైపు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే.. మరోవైపు కేటీఆర్ సొంత బామ్మర్ది ఫామ్​హౌస్ లో డ్రగ్, రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. ఇలాంటి పార్టీలతో కేటీఆర్, ఆయన బామ్మర్ది సమాజానికి ఏం మెసేజ్  ఇస్తున్నారు. పోలీసుల రెయిడ్ కంటే ముందే 20 మంది అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం ఉంది.  - అద్దంకి దయాకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి 

ఎవరినీ వదలొద్దు.. 

రాష్ట్రంలో కొంతమంది బడా నాయకులు డ్రగ్స్ తీసుకుంటూ యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. కేటీఆర్ బామ్మర్ది తన ఫామ్​హౌస్​లో ఇచ్చిన పార్టీలో బడా బాబులు ఉన్నారని తెలుస్తున్నది. ఇందులో ఎవరున్నా వదిలిపెట్టొద్దు. పార్టీలో పాల్గొన్న అందరి వివరాలను బయటపెట్టాలి. 

బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ 

సమగ్ర విచారణ జరిపించాలి: సైబరాబాద్​ ఏసీపీకి సుజాత ఫిర్యాదు

జన్వాడ ఫామ్​హౌస్ లో శనివారం రాత్రి  జరిగిన పార్టీపై సమగ్ర విచారణ జరపాలని సైబరాబాద్​ఏసీపీకి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత, మహిళా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అక్కడ రేవ్ పార్టీ జరిగిందని, డ్రగ్స్ వినియోగించారని, విదేశీ మద్యం ఉన్నదని.. వీటన్నింటిపై విచారణ జరపాలని కోరారు. ఈ కేసులో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. ఇందులో ఎవరున్నా కఠినంగా శిక్షించాలని కోరారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.