డేటా చోరీ కేసులో 11 సంస్థలకు సిట్  నోటీసులు

హైదరాబాద్‌‌, వెలుగు : పర్సనల్  డేటా చోరీ కేసులో సైబరాబాద్‌‌  సిట్‌‌  దర్యాప్తును ముమ్మరం చేసింది. వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన సంస్థలు, థర్డ్ పార్టీ ఎజెన్సీల వివరాలు సేకరిస్తున్నది. డేటా థెఫ్ట్  కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వివరాల  ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నది. ఈ క్రమంలోనే సుమారు11 సంస్థలకు ఆదివారం నోటీసులు జారీ చేసింది.స్టేట్‌‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, టెక్‌‌ మహింద్రా, బిగ్‌‌బాస్కెట్‌‌, ఫోన్‌‌ పే, ఫేస్‌‌బుక్‌‌, క్లబ్ మహేంద్ర, పాలసీ బజార్, యాక్సిక్  బ్యాంక్, యాసిట్‌‌ గ్రూప్, మ్యాట్రిక్స్ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. కస్టమర్ల వ్యక్తిగత వివరాలు ఎలా బయటకు వెళ్లాయో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు.

సంబంధిత సిబ్బందిని తమ ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న రెండు గ్యాంగులను సైబరాబాద్‌‌ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 23న ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద16.8 కోట్ల మంది డేటాను స్వాధీనం చేసుకున్నారు. శనివారం హర్యానాలోనీ ఫరీదాబాద్‌‌కు చెందిన వినయ్‌‌  భరద్వాజ్‌‌ను  అరెస్ట్‌‌  చేసి వద్ద 66.9 కోట్ల మంది పర్సనల్   డేటాను కూడా సీజ్ చేశారు. ఈ రెండు కేసుల ఆధారంగా డేటా అమ్ముతున్న బ్యాంకింగ్‌‌  సెక్టార్‌‌‌‌కు చెందిన థర్డ్‌‌  పార్టీ ఏజెన్సీలు, సంబంధిత బ్యాంకులు, పేమెంట్‌‌ గేట్‌‌వేస్‌‌, ఈ కామర్స్, ఐటీ కంపెనీలు, కన్సెల్టెన్సీల నిర్వాహకుల విచారణకు రంగం సిద్ధం చేసింది.

డేటాథెఫ్ట్  గ్యాంగ్స్‌‌ ఇంకా ఉన్నాయి

ఢిల్లీ, ముంబై, నోయిడా, ఫరీదాబాద్‌‌లోని నిందితుల డేటా సెంటర్‌‌‌‌  నుంచి ఇప్పటికే 83.7 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను సిట్ స్వాధీనం చేసుకుంది. అందులో ఆర్మీ సహా సామాన్యుల నుంచి కార్పొరేట్‌‌ దిగ్గజాల వరకు అందరి వ్యాపారాలు, ఫోన్‌‌  నంబర్లతో పూర్తి వివరాలను గుర్తించారు. ఈ డేటా ఎలా లీక్ అయిందని సిట్‌‌ దర్యాప్తు చేస్తున్నది. నిందితులు అందించిన వివరాలతో డేటా అమ్మిన వారు, కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరిస్తున్నది. ఫోన్‌‌ నంబర్లు, బ్యాంక్  ఖాతాల  వివరాలు సైబర్  నేరగాళ్లకు చేరినట్లు ఇప్పటికే ఆధారాలు సేకరించింది.