తమ సంస్థలో పెట్టుబడి పెడితే రూ.లక్షల్లో లాభాలొస్తాయి అంటూ బాధితుడిని నమ్మించి సైబర్ నేరగాళ్లు వేల రూపాయాలు దోచుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం షాబ్దిపూర్ గ్రామానికి చెందిన జగ్గా ప్రదీప్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తమ సంస్థలో రూ.5 వేలు పెట్టుబడి పెడితే తొలుత రూ.18 వేలు చెల్లిస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 20న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దాన్ని నమ్మిన బాధితుడు వారు చెప్పిన విధంగానే మొదట రూ.5 వేలు తరువాత రూ.10 వేలు చెల్లించాడు. వారు చెప్పినట్టుగా డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.