టె క్నాలజీ పెరగడంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో జనాన్ని మోసం చేసి, అందినకాడికి దండుకుంటున్నారు. ఒకే ఒక్క వీడియో కాల్ ఆగం చేస్తుంది. ముక్కు ముఖం తెలియని వారు యూ ఆర్ అండర్ అరెస్ట్ అనగానే గజగజ వణికిపోతాం. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోతాం. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. నిజానికి ఇది ఒక సైబర్ మోసం. దాని పేరు డిజిటల్ అరెస్ట్.
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. మనదేశంలోనూ డిజిటల్ అరెస్ట్ కేసులు పెరిగిపోతున్నాయి. మాయ మాటలతో మీపై కేసు నమోదైందని, భయపెడుతూ డబ్బు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. 2024 ప్రారంభంలో దేశంలో భారీగా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు జరిగాయి.
జనవరి నుంచి ఏప్రిల్ మధ్య జరిగిన ‘డిజిటల్ అరెస్ట్’ స్కాంలతో నేరగాళ్లు మొత్తం 120 కోట్లను దోచుకున్నారు. ఈ విషయాన్ని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ తెలిపింది. ట్రేడింగ్, పెట్టుబడులు, డేటింగ్ యాప్ వంటి మోసాలన్నీ కలిపితే ఆ మొత్తం రూ.1,776కోట్లు వరకు ఉంటుందని చెప్పింది. సైబర్ నేరగాళ్లలో 46శాతం మంది మయన్మార్, లావోస్, కంబోడియాకు చెందినవారేనని నివేదికలో స్పష్టం చేసింది.
డిజిటల్ అరెస్టు అంటే ఏమిటి?
మీ పేరు మీద డ్రగ్స్, తప్పుడు పాస్‌పోర్టులు, నిషేధిత వస్తువులు వచ్చినట్టుగా చెబుతారు. ఒకవేళ మీరు అసలు మనం అలాంటివి ఆర్డర్ పెట్టలేదని వారితో అరిచి చెప్పినా, వినరు. లేదు మీ పేరు మీద వచ్చింది కాబట్టి మీరే బాధ్యులు అవుతారని అంటారు. చట్టపరంగా చిక్కుల్లో పడతారని మీకు చెబుతారు. ఈ విషయాన్ని మీరు నమ్మేలా చేస్తారు.
కేసు డీల్ చేసి సెటిల్మెంట్ చేసేందుకు డబ్బులు అడుగుతారు. ఇదే డిజిటల్ అరెస్ట్ అంటే. ఇందుకోసం వారు సీబీఐ, కస్టమ్, ఈడీ అధికారులమని చెప్పుకుంటారు. యూనిఫాం ధరించి వీడియో కాల్ చేస్తుంటారు. కేసును మూసివేయడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. పోలీస్ స్టేషన్ లేదా ఏదైనా దర్యాప్తు సంస్థ కార్యాలయం వంటి సెటప్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసుకుని, అవి వీడియోలో కనిపించేలా మోసగాళ్లు చూసుకుంటారు. అచ్చం నిజమైన యూనిఫామ్స్ లాంటివి ధరిస్తారు. అలాగే, నకిలీ ఐడీ కార్డు కూడా చూపెడతారు.
అప్రమత్తతే ముఖ్యం
డిజిటల్ అరెస్ట్ అనేది కొత్త తరహా మోసం. దీనిపై ప్రజల్లో సరైన అవగాహన లేదు. అందుకే చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ప్రధాని మోదీ అక్టోబర్‌లో జరిగిన మన్ కీ బాత్‌లో డిజిటల్ అరెస్టుపై అవగాహన అవసరమని చెప్పారు. ఫోన్లో బెదిరించి ఏ సంస్థ డబ్బులు అడగదని చెప్పారు.
ఫేక్ కాల్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. అలర్ట్‌గా ఉంటే డిజిటల్ అరెస్ట్ మోసాలకు గురికాకుండా ఉండొచ్చు. మొదటగా ప్రశాంతంగా ఉండండి. భయపడవద్దు. వీలైతే స్క్రీన్ రికార్డ్ లేదా వీడియో రికార్డ్ చేయాలి. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థా కూడా ఆన్‌లైన్ ద్వారా బెదిరించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి. అలాగే, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఈ హెల్ప్‌లైన్ నడుస్తోంది. దీనికి ఫోన్ చేయొచ్చు.
- కూర సంతోష్, సీనియర్ జర్నలిస్ట్-