పట్టుకున్న డ్రగ్స్ కొట్టేసిండు.. సైబర్ క్రైమ్ ఎస్సై రాజేంద్ర అరెస్టు

  •     సైబర్ క్రైమ్ ఎస్సై రాజేంద్ర అరెస్టు 
  •     1,750 గ్రాముల డ్రగ్స్ ఇంట్లో దాచిన నిందితుడు
  •     పాత నేరస్తులతో కలిసి అమ్మేందుకు ప్లాన్ 
  •     రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న యాంటీ నార్కోటిక్స్ బ్యూరో 

గచ్చిబౌలి, వెలుగు : డ్రగ్స్ ను అరికట్టాల్సిన పోలీసే.. డ్రగ్స్ దందాకు తెరలేపాడు. ఓ ఆపరేషన్ లో పట్టుకున్న డ్రగ్స్ లో కొంత మేర కొట్టేసి.. తన ఇంట్లో దాచి పెట్టాడు. పాత నేరస్తులతో కలిసి ఆ డ్రగ్స్ అమ్మేందుకు ప్లాన్ చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు. హైదరాబాద్​లోని మణికొండలో ఉంటున్న కోదాటి రాజేంద్ర..  సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం (సీసీఎస్)లో ఎస్ఐగా పని చేస్తున్నారు. 

డ్రగ్స్ పట్టుకునేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సీసీఎస్ ఆధ్వర్యంలో ఓ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా ముంబైకి వెళ్లారు. ఈ టీంలో రాజేంద్ర కూడా ఉన్నారు. ముంబైలో నైజీరియన్​ను అరెస్ట్ చేసి, మెథాక్వలోన్ అనే డ్రగ్ పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అయితే రాజేంద్ర అందులో కొంతమొత్తం సైడ్ చేశారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన 1,750 గ్రాముల డ్రగ్స్ ను ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఇంట్లో దాచుకున్నారు. 

రూ.5 కోట్లకు అమ్మాలని ప్లాన్.. 

ఇంట్లో దాచిపెట్టిన డ్రగ్స్​ను అమ్మి, సొమ్ము చేసుకోవాలని రాజేంద్ర భావించారు. దాదాపు రూ.5 కోట్ల వరకు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా డ్రగ్స్ కేసుల్లో ఉన్న పాత నేరస్తులను కాంటాక్ట్​ అయ్యారు. డ్రగ్స్ అమ్మిపెట్టాలని కోరారు. అయితే ఆ పాత నేరస్తులు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో​అధికారులకు సమాచారం అందించారు. పక్కా సమాచారంతో రాజేంద్ర ఇంటికి వెళ్లిన అధికారులు.. అతను అక్కడ తన కారులో డ్రగ్స్​తో ఉండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. 

అనంతరం ఆయనను రాయదుర్గం పోలీసులకు అప్పగించగా, శనివారం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. కాగా, ఈ కేసులో ఎస్సై రాజేంద్ర అరెస్టు, రిమాండ్ చకచకా జరిగిపోయాయి. కేసు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించలేదు. మాదాపూర్​డీసీపీ, ఏసీపీ, రాయదుర్గం ఇన్​స్పెక్టర్, ఎస్సైలకు ఫోన్లు చేసినా స్పందించలేదు.

2013లో ఏసీబీకి చిక్కిండు.. 

రాజేంద్ర 2009 బ్యాచ్​ ఎస్సై. 2013లో రాయదుర్గం పోలీస్ స్టేషన్​లో ఎస్సైగా పని చేస్తున్న టైమ్​లో ఓ వెహికల్​ను సీజ్ చేశారు. దాన్ని తిరిగి ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు డిమాండ్  చేశారు. బాధితుడి దగ్గరి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్​గా దొరికారు. దీంతో రాజేంద్రను సస్పెండ్  చేశారు. ఆ తర్వాత తిరిగి డ్యూటీలో చేరారు. ఏసీబీ కోర్టులో కేసు నడవగా.. రాజేంద్ర మాదాపూర్ స్టేషన్​లో ఎస్సైగా పనిచేస్తున్న టైమ్​లో 2022లో తీర్పు వచ్చింది. కోర్టు రెండేండ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. అయితే దీనిపై రాజేంద్ర హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత సైబరాబాద్​సీసీఎస్​లో చేరారు.