
- ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘటన
- ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేసిన రాష్ట్ర సీసీఎస్ టీం
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో హైదరాబాద్ సైబర్ క్రైం (సీసీఎస్) పోలీసులను సైబర్ నేరగాడు బురడీ కొట్టించాడు. టాయిలెట్ కని చెప్పి పట్టుకున్న కొద్ది గంటల్లోనే పోలీసుల కండ్లు గప్పి పరారయ్యాడు. దీంతో తెలంగాణ పోలీసులు.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా కేంద్రంగా కొందరు సైబర్ ముఠాగా ఏర్పడి తెలంగాణలోని పలువురిని దోచుకున్నారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీఐ నరేశ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల సీసీఎస్ పోలీసు బృందం 4 రోజుల క్రితం ఢిల్లీ వచ్చింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉంటూ.. కాల్ లిస్ట్, నగదు బదిలీ, సెల్ టవర్ల లోకేషన్ల ఆధారంగా నేరస్తుల కదలికలపై నిఘా పెట్టింది.
అనంతరం సైబర్ క్రైం ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్న దినేశ్ కుమార్‌ను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుంది. అయితే.. వేరే రాష్ట్రాల్లో ఏ క్రిమినల్‌ను పట్టుకున్నా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉంచి కోర్టు ద్వారా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకుని నిందితులను తరలించాల్సి ఉంటుంది. కానీ, లోకల్ స్టేషన్‌లో సమాచారం ఇస్తే తమకు ఇబ్బంది అవుతుందని భావించి, ఆదివారం రాత్రి తెలంగాణ భవన్‌లో తాము ఉంటున్న రూమ్‌కు నేరస్థుడు దినేశ్ కుమార్‌ను తీసుకెళ్లారు. టాయిలెట్ వస్తోందని చెప్పి అర్ధరాత్రి 1:45 గంటలకు పోలీసుల కళ్లుగప్పి దినేశ్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో స్టేట్ సీసీఎస్ బృందం ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని రాత్రి సమయంలో తమతో ఉంచుకోవడంపై ఢిల్లీ పోలీసులు వివరణ కోరారు. అలాగే, సీసీ ఫుటేజీ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ నాలుగో ఫ్లోర్ నుంచి దూకి..
సైబర్, ఇతర నేరాల్లో నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీకి వచ్చే పోలీసులు తెలంగాణ భవన్‌లోనే బస చేస్తారు. నిందితులను పట్టుకున్న తర్వాత భవన్‌లో తమకు కేటాయించిన రూమ్‌ల్లోనే వారిని ఉంచుతారు. గతంలో ఒక కేసులో పట్టుబడ్డ నిందితుడిని తెలంగాణ భవన్‌లో నాలుగో ఫ్లోర్‌లో ఉంచారు. ఈ క్రమంలో నిందితుడు నాలుగో ఫ్లోర్ నుంచి సోలార్ పైప్ సాయంతో పారిపోయేందకు ప్రయత్నించగా, జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే వీవీఐపీలు, ప్రజా ప్రతినిధులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఉండే భవన్‌కి పోలీసులు నేరస్తులను తీసుకురావడంపై తెలంగాణ, ఏపీ భవన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.