- రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో రూ. 11.62కోట్ల గంజాయి సీజ్
- ఈ ఏడాది క్రైమ్ రివ్యూలో భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ డాక్టర్ వినీత్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్స్, ఘోరమైన రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ పెరిగింది. ఈ ఏడాదికి సంబంధించిన క్రైమ్ వివరాలను ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం మీడియాకు వివరించారు. గతేడాది 5,274కేసులు నమోదు కాగా, ఈసారి 5,293 కేసులు నమోదయ్యాయి.
సైబర్ క్రైమ్ కేసులు లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఎక్కువయ్యాయి. లాస్ట్ ఇయర్ 117సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 138 కేసులు నమోదయ్యాయి. సైబర్‌మోసగాళ్ల చేతిలో జిల్లా వాసులు దాదాపు రూ. 4.76కోట్ల మేర నష్టపోయారు. రూ. 76.24లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. దాదాపు రూ. 91వేలను సైబర్ నేరస్థుల నుంచి కాపాడి బాధితులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదాలు గతేడాది 194 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 216 కేసులు నమోదయ్యాయి.
ఎస్సీ, ఎస్టీ కేసులు లాస్ట్ ఇయర్ 78 నమోదు కాగా, ఈ ఏడాది 84, మహిళా వేధింపు కేసులు లాస్ట్ఇయర్ 689 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 739 కేసులు నమోదయ్యాయి. లాస్ట్ ఇయర్ 21 మర్డర్లు కాగా ఈ ఏడాది 26 మర్డర్లు జరిగాయి.
లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే 23.8శాతం మర్టర్ కేసులు పెరిగాయి. రాత్రి దొంగతనాలు గతేడాది 127 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 137కేసులు నమోదయ్యాయి. పగటి దొంతనాలు మాత్రం తగ్గాయి. రేప్ కేసులు గతేడాది 61 నమోదు కాగా, ఈ ఏడాది 57 నమోదయ్యాయి. ఈ ఏడాదిలో 379 కేసులకు సంబంధించి దాదాపు రూ. 4.27కోట్ల మేర ప్రాపర్టీ లాస్ కాగా, 228 కేసులకు చెందిన దాదాపు రూ.1.23కోట్ల ప్రాపర్టీని రికవరీ చేశారు.
రికార్డు స్థాయిలో గంజాయి సీజ్..
రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 73 కేసులకు సంబంధించి రూ. 11.62కోట్ల విలువైన 4,734 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసుల్లో 142 మందిని అరెస్ట్ చేశారు. గంజాయి కేసులు లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే దాదాపు 48.4శాతం పెరిగాయి. లాస్ట్ ఇయర్ డ్రైంకెన్ డ్రైవ్ కేసులు 12,608 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 14,629 కేసులు నమోదయ్యాయి.
ఈ ఏడాదిలో 9 కేసులకు సంబంధించి జీవిత ఖైదు శిక్షలు పడ్డాయి. మావోయిస్టుల కట్టడిలో జిల్లా పోలీసులు సక్సెస్ అయ్యారు. ఐదుగురు మావోయిస్టులు సరెండర్ అయ్యారు. నక్సల్స్‌తో పాటు మిలీషియా మెంబర్స్, కొరియర్స్, సానుభూతి పరులు మొత్తం 80 మందిని అరెస్టు చేశారు. జనరల్ఎలక్షన్స్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారన్నారు.