
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ అడ్డాగా సాగుతున్న సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు షెల్ కంపెనీలు కేరాఫ్‌గా మారుతున్నాయి. ఫేక్ డాక్యుమెంట్లు, నకిలీ డైరెక్టర్లతో ఏర్పాటవుతున్న బోగస్ కంపెనీలు.. ఏటా రూ.వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరుపుతున్నాయి. ఇలాంటి కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) రికార్డుల్లో ఉంటాయే తప్ప.. ఫర్మ్‌లో పేర్కొన్న అడ్రస్‌లలో కనిపించవు.
ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, ఇన్‌స్టంట్ లోన్స్ ఇతర సైబర్ నేరాల్లో వసూలు చేస్తున్న రూ.కోట్ల నగదు ముందుగా ఇటువంటి షెల్ కంపెనీల అకౌంట్లలోకి వెళ్తుంది. అక్కడి నుంచి హవాలా, క్రిప్టో, బిట్‌కాయిన్స్ రూపంలో దుబాయ్, చైనా సహా ఇతర దేశాలకు తరలిపోతున్నది. ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఎక్కువగా షెల్ కంపెనీల లింకులను ఈడీ సహా దర్యాప్తు సంస్థలు గుర్తిస్తున్నాయి.
ఇండియాలో బ్యాంక్ అకౌంట్స్, దుబాయ్‌లో క్రిప్టో కరెన్సీ
సాధారణంగా ఏదైనా కంపెనీ ఏర్పాటు చేయాలంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఇండియా విధివిధినాలకు అనుగుణంగా డాక్యుమెంట్లు అందించాలి. కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతం సహా చైర్మన్, డైరెక్టర్ల వివరాలను వెల్లడించాలి. ఇక్కడే సైబర్ నేరగాళ్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, వెస్ట్ బెంగాల్ సహా మెట్రో సిటీస్‌లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులకు డబ్బు ఆశ చూపి వారి పేర్లతో ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫర్మ్ పేరుతో కరెంట్ ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోన్ నంబర్స్, నెట్ బ్యాంకింగ్ సహా పూర్తి ఆపరేషన్లను తమ ఆధీనంలోనే ఉంచుకుంటున్నారు. ఇలాంటి షెల్ కంపెనీల అకౌంట్లను ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలకు వాడుతున్నారు. అంతర్జాతీయ బ్యాంకులతో కూడా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
ఇక్కడి వాళ్లే ఏజెంట్లు.. వాళ్లతోనే నెట్‌వర్క్
చైనా సహా వివిధ దేశాలకు చెందిన సైబర్ మోస గాళ్లు టూరిస్ట్, బిజినెస్ వీసాలపై ఇండియాకు వస్తున్నారు. ఢిల్లీ, ముంబైలో షెల్టర్ తీసుకుంటున్నారు. దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో నార్త్ ఇండియాలోని రాష్ట్రా లకు చెందిన వారితో సైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఢిల్లీలోని స్థానికుల పేర్లతో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి సైబర్ మోసాలకు ప్లాన్ చేస్తున్నారు. విదేశాల నుంచి ఆపరేట్ చేసే విధంగా లింక్స్ సర్క్యులేట్ చేస్తున్నారు. పేమెంట్ గేట్‌వేస్ ద్వారా అమౌంట్ కలెక్షన్, షెల్ కంపెనీల ద్వారా మనీ ల్యాండరింగ్‌కు పాల్ప డుతున్నారు. ఇలా ప్రతి ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 90 శాతం మంది నార్త్ స్టేట్స్కు చెందిన వాళ్లేనని సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈడీ దర్యాప్తుల్లో వెలుగు చూసింది.
మూడు లేయర్స్‌లో చైనా యాప్స్ నెట్‌వర్క్
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ నిర్వాహకులు ప్రధానంగా మూడు లేయర్స్ లో నెట్‌వర్క్ ను ఆపరేట్ చేస్తున్నారు. చైనా లోన్ యాప్స్ పేర్లను మార్చుతూ గూగుల్ ప్లే స్టోర్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. చైనా సర్వర్ల నుంచే యాప్స్ ఆపరేట్ అవుతాయి. మూడేండ్ల క్రితం సంచలనం సృష్టించిన కలర్ ప్రిడిక్షన్ ఆన్‌లైన్ గేమ్, లోన్ యాప్ కేసుల్లోనూ ఇక్కడి షెల్ కంపెనీలు భారీగా బయటపడ్డాయి. హైదరాబాద్‌లో నమోదైన 49 కేసుల్లో 38 షెల్ కంపెనీల ద్వారా రూ.1,800 కోట్లు కొట్టేశారు.
బీజింగ్ టుమారో కంపెనీతో లింకులు ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా ఈ కేసుల్లో ప్రధాన నిందితుడైన చైనాకు చెందిన యాన్‌హూ అలియాస్ ల్యాంబో, షెల్ కంపెనీల డైరెక్టర్లు ఢిల్లీకి చెందిన ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్‌తులిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్‌లో నమోదైన 42 కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 1.4 కోట్ల ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.21 వేల కోట్లు మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించారు.
ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో ఫాల్కన్ సంస్థ 6,979 మంది డిపాజిటర్ల వద్ద రూ.1,700 కోట్లు వసూలు చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు, వడ్డీ ఇస్తామంటూ ఏడాదిన్నరగా ఆన్‌లైన్ డిపాజిట్లు సేకరించింది. 32 షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు జరిపింది. రూ.850 కోట్లు మోసం చేసింది. ఈడీ దర్యాప్తులో షెల్ కంపెనీల గుట్టుబయటపడింది. రికార్డుల్లో తప్ప కంపెనీల ఆపరేషన్లు ఎక్కడా లేవని గుర్తించింది. మనీలాండరింగ్‌పై సమగ్ర దర్యాప్తు చేస్తున్నది.
అమెరికన్ల పేపాల్‌ను టార్గెట్ చేసి హైటెక్ సిటీలో గుజరాత్ గ్యాంగ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. అనధికారిక లావాదేవీలు చేశారంటూ అందికాడికి వసూలు చేసింది. అమెరికన్ డాలర్లను క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్‌కి.. అక్కడి నుంచి ఇండియాకు తరలించింది. ఇందుకోసం షెల్ కంపెనీల పేర్లతో కరెంట్ ఖాతాలను ఆపరేట్ చేసింది. షెల్ కంపెనీల ద్వారా జరిగిన మనీలాండరింగ్ వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈడీ సేకరిస్తున్నాయి.