క్యాష్ బ్యాక్ ఆఫర్ పేరుతో రూ. 4 లక్షలు కొట్టేసిన్రు

  •   ముగ్గురు సభ్యుల గ్యాంగ్ అరెస్ట్
  •     పలు రాష్ట్రాల్లో వీరిపై 1,292 కేసులు

గచ్చిబౌలి, వెలుగు : క్రెడిట్​ కార్డుపై క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చిందంటూ సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ. 4 లక్షలకు పైగా కొట్టేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబరాబాద్​కు చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది మార్చి 21న యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అంటూ ఒకతను కాల్ చేశాడు. క్రెడిట్ కార్డుపై రూ.4,500 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందని.. వచ్చే నెల బిల్లులో ఆ మొత్తాన్ని క్రెడిట్ చేస్తామని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన డీటెయిల్స్ ను చెప్పాడు. ఆ తర్వాత అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి 3 ట్రాన్జాక్షన్లలో రూ.4 లక్షల 71 వేలు డెబిట్ అయ్యాయి. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్​క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని నజఫ్ గఢ్ ప్రాంతానికి చెందిన భూపేందర్ కుమార్, ఉత్తమ్ నగర్​కు చెందిన హిమాన్షుకుమార్, సోను రాథోడ్ ముగ్గురు కలిసి గ్యాంగ్​గా ఏర్పడి ఇలాంటి మోసాలు చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్​కు తరలించారు. నిందితులపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 1,292 కేసులు నమోదయ్యాయని, అందులో తెలంగాణలో 166, సైబరాబాద్ లో 23 కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

ALSO READ:కోర్టు ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదు?.. ఐఐఐటీ వీసీ, రిజిస్ట్రార్లకు హైకోర్టు ధిక్కార నోటీసులు