హైదరాబాద్ సీపీ పేరిట..రూ. 43 లక్షలు ఊడ్చేసిన కేటుగాళ్లు

హైదరాబాద్ సీపీ పేరిట..రూ. 43 లక్షలు ఊడ్చేసిన కేటుగాళ్లు
  • ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులను మోసగించిన సైబర్ నేరగాళ్లు

బషీర్ బాగ్, వెలుగు:    హైదరా బాద్ పోలీస్ కమిషనర్ పేరిట సిటీకి చెందిన రిటైర్డ్ మహిళా ఉద్యోగి(80 )ని సైబర్ చీటర్స్ మోసగించారు. కొద్దిరోజుల కిందట ఆమె మొబైల్ నంబర్ పై హైదరాబాద్ నుంచి డ్రగ్స్ ఢిల్లీకి  పార్సిల్ అవుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు.  కేసు ఫైల్ చేయొద్దంటే ఆమె అకౌంట్ లోని నగదు ట్రాన్స్ ఫర్ చేయాలని, ఆర్బీఐ రూల్స్ మేరకు వెరీఫై చేసి, తిరిగి పంపిస్తామంటూ నమ్మించారు. 

దీంతో బాధితురాలు తన అకౌంట్ లోని రూ. 22 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసింది. అనంతరం ఆమె తన కొడుకుకు విషయం చెప్పగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి తెలిపారు.

దావుద్ అనుచరుడు అకౌంట్లు వాడుతున్నడని..

ఆర్బీఐ అధికారి పేరుతో సిటీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి(60)ని సైబర్ చీటర్స్ మోసగించారు. అతని ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్లతో క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ అనుచరుడు మహమ్మద్ యూనిస్ ఖాన్ లావాదేవీలు చేస్తున్నట్లు, వాటిని మనీ లాండరింగ్, క్రిప్టో కరెన్సీ , డ్రగ్స్ అక్రమ రవాణాకు వాడుతున్నట్టు కొద్దిరోజుల కిందట ఫోన్ చేసి బెదిరించి పెట్టేశారు. అనంతరం ముంబై ఎన్ఐఏ అధికారిని అంటూ ఓ వ్యక్తి వాట్సప్ వీడియో కాల్ చేశాడు. బాధితుడి పేరుపై నకిలీ పిటీషన్లు, అరెస్ట్ వారెంట్లు సెండ్ చేశాడు. 

దీంతో బాధితుడు త్వరలో తన కొడుకు పెండ్లి ఉందని, అరెస్ట్ అయితే పరువు పోతుందని ప్రాధేయపడ్డాడు. కేసు ఫైల్ చేయొద్దంటే, అతని బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులను  తమకు ట్రాన్స్ ఫర్ చేస్తే, వెరీఫై చేసి రిటర్న్ పంపిస్తామని నమ్మించారు. కొడుకు పెళ్లి ఖర్చులకు దాచిన రూ. 21 లక్షలు నేరగాళ్లు చెప్పిన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు. అనంతరం బాధితుడిని కుటుంబసభ్యులు ఒత్తిడి చేయగా జరిగిన విషయం చెప్పాడు. మోసపోయామని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.