- బాధితుడి ఫిర్యాదుతో రూ.50 లక్షలు రికవరీ
బషీర్ బాగ్, వెలుగు: స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టించి, ఓ వ్యాపారి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.31 కోట్లను కొట్టేశారు. ఈ కేసులో హైదరాబాద్సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి, రూ.50 లక్షలను రికవరీ చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. 53 ఏండ్ల వ్యాపారవేత్తకు తొలుత వాట్సాప్ లో సైబర్ చీటర్స్ మెసేజ్ చేశారు. PML ప్రో ట్రేడింగ్ యాప్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు సదరు యాప్ను డౌన్ లోడ్ చేసుకొని, సహాయం కోసం యాప్ కస్టమర్ సెంటర్ ని సంప్రదించారు.
వారి సూచనతో ఓ ఐపీవోలో మొత్తం రూ. 1,31,48,500 లు ఇన్వెస్ట్ చేశాడు. అనంతరం బాధితుడు డబ్బులు విత్డ్రా చేయడానికి ప్రయత్నిస్తే, అతన్ని బ్లాక్ చేశారు. అదనంగా మరింత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని కోరడంతో ఈ నెల 16న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎన్సీఆర్పీ పోర్టల్ లో ఈ మోసపూరిత లావాదేవీలను నమోదు చేశారు. అనంతరం బాధితుడి బ్యాంక్ అధికారులకు నోటీసులు పంపించి , రూ. 50 లక్షలను ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేసిన డబ్బులను బాధితుడి అకౌంట్ కు బుధవారం బదిలీ చేశారు.