- జనానికి అవగాహన పెరగడంతో రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు
- ఫ్రాడ్‌లో స్థానికులను వాడుకుంటున్న వైనం
- మోసాన్ని గుర్తించేలోపు అకౌంట్‌లో అమౌంట్ మాయం
జగిత్యాల, వెలుగు: సైబర్ నేరగాళ్లు నయా పంథా ఎంచుకున్నారు. పోలీసులు, బ్యాంకులు, ఇతర సంస్థలు మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కస్టమర్లను ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) అడగరని, ఎవరు అడిగినా మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పొద్దని ప్రచారం చేస్తుండడంతో జనంలో కొంత మార్పు వచ్చింది. దీంతో సైబర్ నేరగాళ్లు మరింత అప్డేట్ అవుతూ జనాలను నమ్మించేందుకు ఏకంగా స్థానికులను ఫ్రాడ్ లో భాగస్వాములను చేస్తున్నారు. అవగాహన పెరగడంతో సరికొత్తగా మోసం మీకు లోన్ వచ్చింది.. క్రెడిట్ కార్డు ఆఫర్ ఉందని.. ప్రైజ్ మనీ గెలుచుకున్నారని ఎవరైనా ఫ్రాడ్ కాల్ చేస్తే జనం కట్ చేస్తున్నారు.
ఎవరూ ఓటీపీ చెప్పడం లేదు.. ఇంకొందరు పోలీస్ ఫిర్యాదు ఇస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయినట్లు గుర్తించగానే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. డబ్బులు పోయిన గంటలోపు రికవరీ చేసే చాన్స్ ఉంది. అది కూడా డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన అకౌంట్ నుంచి విత్ డ్రా చేయకపోతే ఆ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసి రికవరీ చేయచ్చు. ఇలా ఇన్ టైమ్ లో ఫిర్యాదు చేసిన సంఘటనల్లో సైబర్ క్రైం పోలీసులు రికవరీ చేస్తున్నారు. దీంతో సైబర్ మోసగాళ్లు రూట్ మార్చి దోపిడీకి దిగుతున్నారు.
స్థానికులను ఇన్‌వాల్వ్ చేస్తున్నరు..
తాజాగా వివిధ రకాల షాపులు, సంస్థలు.. షోరూంల నంబర్లు సేకరిస్తూ సైబర్ మోసంలో వారిని వాడుకుంటున్నారు. స్థానికులైన ఇద్దరి వ్యక్తులను భాగస్వాములను చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఫలానా వస్తువులు కావాలని కాల్ చేస్తూ, అందుకు సంబంధించిన అడ్వాన్స్ ఫలానా వ్యక్తి ఇస్తాడంటూ పంపిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక వారిని కన్ఫ్యూజ్ చేసి మోసం చేస్తున్నారు. నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీ అయ్యే చాన్స్ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. దీనిని పోలీసులు గోల్డెన్ పీరియడ్ అని పిలుస్తారు. కాగా ఈ కొత్త మోసాల్లో నేరగాళ్లు.. అమౌంట్ ట్రాన్స్‌ఫర్ కాగానే మరో అకౌంట్‌కు వెంటనే బదిలీ చేస్తున్నారు. దీంతో రికవరీ కష్టంగా ఉంటోందని పోలీసులు చెబుతున్నారు. తాజాగా ఈనెల 1, 12న జగిత్యాలలో ఇదే రీతిలో మోసం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
“ ఒక బిర్యానీ సెంటర్ నిర్వాహకుడికి ఓ అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. తమకు 70 ప్లేట్ల బిర్యానీ కావాలని.. ఓ చోటకు వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తితో మాట్లాడిస్తే ఆర్డర్ ఓకే చేసి అడ్వాన్స్ ఇప్పిస్తామని చెప్పాడు. ఇది నమ్మిన బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు సదరు వ్యక్తి చెప్పిన ఆన్‌లైన్ సంస్థకు వెళ్లి అజ్ఞాత వ్యక్తికి కాల్ చేశాడు. సదరు మోసగాడు చెప్పినట్లుగానే లోపల ఉన్న వ్యక్తికి ఫోన్ ఇవ్వడంతో వెంటనే ఆ ఫ్రాడ్ తాను ఓ పెట్రోల్ బంక్ ఓనర్‌నని, తన వర్కర్‌కు రూ.50 వేలు క్యాష్ ఇచ్చి పంపానని, తనకు అర్జెంటుగా అమౌంట్ అవసరముందని తాను చెప్పిన నంబర్‌కు ట్రాన్స్‌ఫర్ చేయమని రిక్వెస్ట్ చేశాడు.
నమ్మిన ఆన్ లైన్ నిర్వాహకుడు ఆ ఫ్రాడ్ కాల్ లో ఉండగానే అమౌంట్ పంపించాడు. అమౌంట్ ట్రాన్స్‌ఫర్ కాగానే వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తరువాత అమౌంట్ ఇవ్వమని ఆన్ లైన్ నిర్వాహకుడు అడగడంతో బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు కంగుతిన్నాడు. తనకు ఆర్డర్ అడ్వాన్స్ ఇస్తామంటే వచ్చానని చెప్పడంతో మోసపోయామని గ్రహించి ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు ఈ నెల 1న జగిత్యాల పాత బస్టాండ్, ఈ నెల 12న అన్నపూర్ణ చౌరస్తా వద్ద గల ఆన్ లైన్ సెంటర్లలో జరిగాయి. బాధితులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గోల్డెన్ పీరియడ్ లో ఫిర్యాదు చేయాలి
సైబర్ క్రైం కేసుల్లో ఫ్రాడ్ జరిగినప్పుడు మొదటి, రెండు గంటల్లో(గోల్డెన్ పీరియడ్) సమాచారమిస్తే బాధితులకు న్యాయం జరిగేలా సైబర్ క్రైం వింగ్ చర్యలు తీసుకుంటుంది. ఈనెల 12న జరిగిన సైబర్ మోసం లో ఇప్పటికే రూ. 11 వేలను అన్ హోల్డ్ చేశాం. సైబర్ మోసాలపై ఇప్పటికే వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితులు 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా వెబ్ సైట్ CYBERCRIME.GOV.IN లోనైనా ఫిర్యాదు చేయాలి. ప్రతి పీఎస్ లో సైబర్ వారియర్స్ పనిచేస్తున్నారు. వారు వెంటనే సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తారు.
- రంగారెడ్డి, సైబర్ క్రైం డీఎస్పీ జగిత్యాల