పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వివిధ మార్గాల్లో అమాయకులను బురిడి కొట్టించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సైబర్ నేరాల కట్టడికి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తుండటంతో.. నేరగాళ్లు కొత్త కొత్త పంథాలు వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త తరహా క్రైమ్ వెలుగులోకి వచ్చింది. మీ పేరిట డ్రగ్స్ కొరియర్ వచ్చిందని.. హవాలా నగదు బదిలీ జరిగిందని.. మీపై ఆన్ లైన్లో కేసు నమోదు అయ్యిందని గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుండి సైబర్ నేరగాళ్లు కాల్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు.
పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ వంటి ఏజెన్సీల పేరిట కాల్స్ చేసి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీటితో పాటు మనీలాండరింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, టెర్రరిస్ట్ ఆక్టివిటీస్పై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయంటూ వీడియో కాల్స్ చేస్తూ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నకిలీ సీబీఐ అధికారుల పేరిట వీడియో కాల్ ఇంటరాగేషన్ చేస్తూ.. కేసు నుంచి బయటపడాలంటే కొంత డబ్బును చెల్లించాలని డిమాండ్ చేస్తు్న్నారు కేటుగాళ్లు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధ జంటను డిజిటల్ అరెస్టు అయ్యారని బెదిరించి.. రూ.10.61 కోట్లు కొట్టేశారు.
ALSO READ | తమిళనాడులో ఒకేసారి 250 మంది శాంసంగ్ ఉద్యోగుల అరెస్ట్.. ఎందుకంటే..?
మోసం పోయామని గ్రహించిన బాధితులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కంప్లెంట్ చేశారు. మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్‌కు చిక్కి రూ.46 లక్షలు లాస్ అయ్యింది. ఆమె బ్యాంకు ఖాతాను డ్రగ్ ట్రాఫికింగ్, ఉగ్రవాద ఆక్టివీటిస్కు యూజ్ చేస్తున్నారని భయపెట్టి డబ్బు కొల్లగొట్టారు. రోజురోజుకు డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
డిజిటల్ అరెస్ట్ అనేది వ్యక్తులను భయపెట్టి డబ్బు వసూలు చేసే క్రైం మెథడ్ అని.. దీనికి ఎవరూ బయపడొద్దని సూచించారు. మోసగాళ్లు మీకు ఫోన్ చేసి అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్టులు, టెర్రరిస్టు ఆక్టివిటీస్ పేరుతో పార్సిల్‌లు వచ్చినట్లు వీడియో కాల్ చేస్తారు. ఇలాంటి సందర్భంలో కేసు రాజీ చేయడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఈ సమయంలో ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా.. ఎవరు డబ్బు అడిగినా, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కాల్ చేయండని సూచించారు.