
- సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో ఆలస్యంగా తెలిసిన ఘటన
గరిడేపల్లి, వెలుగు: సీబీఐ పోలీసులమని వృద్ధుడి నుంచి సైబర్ క్రిమినల్స్ రూ. లక్షల్లో కొట్టేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఒక వృద్ధుడికి గత జనవరి రెండో వారంలో సైబర్ క్రిమినల్స్ ఫోన్ కాల్ చేశారు. బెంగళూరుకు చెందిన సీబీఐ పోలీసులమని, మనుషులను కిడ్నాప్ చేసే ముఠాతో సంబంధం కలిగి ఉన్నావని అతడిని బెదిరించారు.
అంతేకాకుండా వృద్ధుడి అకౌంట్ కు కమిషన్ గా రూ. 30 లక్షలు వచ్చాయని, దీనిపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసిందని చెప్పారు. ఫారెన్ లో ఉండే అతని కొడుకుతో పాటు కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన అతడు సైబర్ క్రిమినల్స్ చెప్పిన వివిధ అకౌంట్లకు పలుమార్లు రూ. 18 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు.
ఇలా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు డబ్బులు పంపించాడు. మళ్లీ ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో అతను భరించలేక జరిగినదంతా కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనుమానం వచ్చి పోలీసులకు కంప్లయింట్ చేయగా సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోయినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.