కేసులో తప్పిస్తామని రూ. 23 లక్షలు ఫ్రాడ్

కేసులో తప్పిస్తామని రూ. 23 లక్షలు ఫ్రాడ్
  •     హైదరాబాద్​ వ్యాపారిని మోసగించిన సైబర్ నేరగాళ్లు  

బషీర్ బాగ్, వెలుగు :  మనీ లాండరింగ్ కేసు నుంచి తప్పిస్తామని హైదరాబాద్​కు చెందిన ఓ వ్యాపారి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 23 లక్షలు కొట్టేశారు.  హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి కథనం ప్రకారం... ఓ వ్యాపారి(64)కి ఢిల్లీలోని లజ్ పత్ నగర్ పీఎస్​ నుంచి సీనియర్ హెడ్ కానిస్టేబుల్ అంటూ ఒకరు ఫోన్ చేశారు. ఓ బ్యాంక్ ఖాతా ద్వారా జరిగిన మనీ లాండరింగ్ కేసులో వ్యాపారి పేరు ఉందని, సైబర్ క్రైమ్ ఇన్ స్పెక్టర్​కు ఫోన్​ ఇస్తున్నానని మాట్లాడాలని చెప్పాడు. 

ఇన్ స్పెక్టర్ లైన్​లోకి వచ్చి నవాబ్ మాలిక్ అనే వ్యక్తి ద్వారా రూ. 300 కోట్ల మనీ లాండరింగ్ జరిగింని, ఇందులో వ్యాపారి పై కేసు నమోదైందని చెప్పాడు.  తనకు నవాబ్ మాలిక్  తెలియదని, సదరు బ్యాంక్ లో అకౌంట్ లేదని చెప్పినా వినలేదు. వ్యాపారి వాట్సాప్ కు ఫేక్​ అరెస్ట్ వారెంట్, సీబీఐ, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ నుంచి ఫేక్​ నోటీసులు పంపించడంతో భయపడ్డాడు. రూ. 23 లక్షలు డబ్బులు ఇస్తే కేసు నుంచి బయటపడేస్తామని చెప్పారు. దీన్ని నమ్మిన వ్యాపారి వారు అడిగినట్టు రూ. 23 లక్షల ట్రాన్స్ ఫర్ చేశాడు. వెంటనే  కాల్ డిస్​కనెక్ట్​ అవ్వడంతో పాటు నోటీస్ మెసేజ్ లు కూడా డిలీట్ అయ్యాయి. తిరిగి సైబర్ నేరగాళ్లకు కాల్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధిత వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.