
బషీర్బాగ్, వెలుగు: గిఫ్ట్ హ్యాంపర్ పేరిట ఓ వ్యాపారిని సైబర్ చీటర్స్ మోసగించారు. సిటీకి చెందిన 47 ఏళ్ల వ్యాపారవేత్తకు వారం కిందట ఓ ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి దుబాయ్ కు చెందిన జాంజాం ఎలక్ట్రానిక్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పి, వ్యాపారి గిఫ్ట్ హ్యాంపర్ గెలుపొందినట్లు చెప్పాడు. అందులో 100 గ్రాముల బంగారం, ఒక లాప్ టాప్, టాబ్లెట్ గాడ్జెట్స్ ఉన్నాయన్నారు.
బాధిత వ్యాపారిని నమ్మించేందుకు ఇతరులకు పంపించిన గిఫ్ట్ హ్యాంపర్ ఫొటోలను షేర్ చేశాడు. తాము హైదరాబాద్‌కు వీటిని పంపిస్తామని చెప్పి కాల్‌కట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు గిఫ్ట్ హ్యాంపర్‌ను ముంబై ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు నిలిపివేశారని, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం కొంత పేమెంట్ చేయాలన్నారు. దీంతో వ్యాపారి వారికి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశాడు.
మరుసటి రోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కూడా కస్టమ్స్ అధికారులు పార్శిల్ నిలిపివేశారని, మరికొంత డబ్బులను చెల్లించాలని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అనంతరం కాల్స్ రాకపోవడంతో మొత్తం రూ. 2,26,940 లను మోసపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.