- పోలీసుల పేరిట మీ కొడుకు కేసులో ఇరుక్కున్నాడంటూ ఫోన్
- క్రైం నుంచి తప్పిస్తామని డబ్బులు డిమాండ్
- జగిత్యాల జిల్లాలో గల్ఫ్ కార్మికులే కుటుంబ సభ్యులే టార్గెట్‌గా మోసాలు
జగిత్యాల, వెలుగు: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసుల పేరిట ఫోన్ చేస్తూ ఆగం పట్టిస్తున్నారు. ‘మీ కొడుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు.. జైలుకు పోవాల్సిందే.. ఇక బయటకు వచ్చే అవకాశం ఉండదు.. మీకు చివరి చూపులు కూడా దక్కవు’ అంటూ గల్ఫ్ కార్మికుల పేరెంట్స్‌కు వాట్సప్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
అవి కూడా పోలీసుల డీపీలతో ఫోన్స్ రావడంతో పేరెంట్స్, కుటుంబసభ్యులు భయపడుతున్నారు. జగిత్యాల జిల్లాలో గల్ఫ్ కార్మికులు ఎక్కువగా ఉండడంతో ఈ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన కొందరు అడిగినంత ఇచ్చి, బయట పడదామని చూస్తుండగా, మరికొందరు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఎన్‌ఆర్‌ఐల ఫ్యామిలీ మెంబర్సే టార్గెట్
జిల్లా కు చెందిన పలువురు వేల సంఖ్యలో ఉపాధి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో వాట్సప్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుండటం కలవరానికి గురిచేస్తోంది. ఇటీవల జిల్లాకేంద్రానికి చెందిన దారం లచ్చిరెడ్డి కుమారుడు సింగపూర్‌లో, బద్దం రవీందర్ కొడుకు కెనడాలో, మిర్యాల ఆనంద్ కొడుకు అమెరికాలో ఉండగా.. వీరికి ‘మీ కొడుకు డ్రగ్స్ దందా చేస్తున్నాడని, మర్డర్ కేసుల్లో ఇర్కున్నాడు’ అంటూ పోలీస్ ఉన్నతాధికారి డీపీతో ఫేక్ వాట్సప్ కాల్స్ వచ్చాయి.
రూ. 50 వేలు ఇస్తే కేసుల నుంచి తప్పిస్తామని లేదంటే జైలు పాలవుతారని భయపెట్టారు. ఆందోళనకు గురైన పేరెంట్స్ వారి పిల్లలకు ఫోన్ చేసి ఎలాంటి ఆపద లేదని ఊపిరి పీల్చుకున్నారు. కాగా మరికొందరు షిఫ్టుల వారీగా డ్యూటీలు చేస్తుంటారు. అలాంటి వారు స్పందించకపోవడంతో ఇక్కడి పేరెంట్స్ ఆందోళన చెంది డబ్బులు ఇచ్చిన వారూ ఉన్నారు.
డిజిటల్ కాదు.. అరెస్ట్ అయ్యారని బెదిరింపులు
ఇప్పటి వరకు డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు వంచించి రూ.కోట్ల లో డబ్బులు వసూలు చేయగా, తాజాగా నయా ట్రెండ్ మొదలైంది. పోలీసులు, రిజర్వు బ్యాంకు.. ఇతర సంస్థలు సైబర్ మోసాల పై అవగాహన సదస్సులు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తుంటే, సైబర్ నేరగాళ్లు కొత్త రూట్ లో బోల్తా కొట్టిస్తున్నారు. ఏకంగా మీ కొడుకు అరెస్ట్ అయ్యాడు.. బయటకు రావాలంటే ఫలానా ఖాతాలో ఇంత డబ్బు పంపాలంటూ బెదిరింపులకు దిగుతుండడంతో ప్రవాసుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటివరకు పోలీసుల యూనిఫాం వేసుకుని వీడియో కాల్ చేసి బెదిరిస్తున్న తీరుపై ఓ వైపు ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తుండగా, సైబర్ నేరగాళ్లు రూట్ మార్చి ఏకంగా అరెస్ట్ అయ్యారని బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇలా రూ.50వేల నుంచి రూ.లక్షల వరకు డబ్బులు వసూలు
చేస్తున్నారు.