డ్రగ్స్ పార్సిల్స్ పేరుతో భయపెట్టి.. ల క్షా 16 వేలు వసూలు చేసిన సైబర్​ నేరగాళ్లు

డ్రగ్స్ పార్సిల్స్ పేరుతో భయపెట్టి.. ల క్షా 16 వేలు వసూలు చేసిన సైబర్​ నేరగాళ్లు

బషీర్ బాగ్, వెలుగు : హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధుడికి(71) సైబర్​ నేరస్తులు కాల్​ చేసిన తన పేరుతో ముంబై నుంచి కొరియర్​లో డ్రగ్స్​ పార్సల్​ అవుతున్నాయని , కేసులు అయ్యాయని భయపెట్టి డబ్బులు లాగారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్​సైబర్​ క్రైమ్​ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. బాధిత వృద్ధుడికి డీటీడీసీ కొరియర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంటూ ఈ నెల 11న కొందరు కాల్​ చేశారు. 

తన పేరుతో ముంబై నుంచి తైవాన్ కు పార్సిల్ ఉందని, దాంట్లో ఐదు కేజీల బట్టలు, ఎనిమిది బ్యాంక్ ఏటీఎం కార్డ్స్ తో పాటు 700 గ్రాముల డ్రగ్స్ ఉన్నాయని , ముంబై లో కేసు నమోదు అయిందని చెప్పారు. అనంతరం ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమని వాట్సాప్​లో వీడియో కాల్ చేశారు. మనీలాండరింగ్ , డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారితో లావాదేవీలు జరిగాయని భయపెట్టారు. ముంబై ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ , సీబీఐలో కేసులు నమోదు అయ్యాయన్నారు.

 వీటి నుంచి బయటపడాలంటే డబ్బులు పంపాలని చెప్పగా.. వృద్ధుడు రూ. 1 లక్ష 16 వేలు పంపాడు. కాసేపటికి జరిగిన విషయాన్ని అతని భార్యకు తెలపడంతో, ఆమె అనుమానించింది. దీంతో వృద్ధుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.