సగం మనిషి.. సగం మెషీన్..

సగం మనిషి.. సగం మెషీన్..

ఈ ‘సైబోర్గ్’ సైన్యం

2050 నాటికి వాటిదే రాజ్యమంటున్న అమెరికా ఆర్మీ

అమెరికా కంబాట్​ కేపబిలిటీస్​ డెవలప్​మెంట్​ కమాండ్​ దేవ్​కమ్​ రిపోర్ట్​

హెల్త్​కేర్​లోనే మరింత ఎక్కువ ఉపయోగమని వెల్లడి

అర్ధనారీశ్వరుడు అని శివుడికి పేరు. కారణం, పార్వతి దేవిని తన దేహంలో సగ భాగం చేసుకున్నాడు కాబట్టి! మరి, మనిషి, మెషీన్ కలిస్తే ఏమవుతది? డెడ్లీ సైన్యం అవుతది. శత్రువులను చీల్చి చెండాడుతుంది. ప్రతి కదలిక, ప్రతి అణువును తన అధీనంలో ఉంచుకుంటుంది. అదే సైబోర్గ్ సైన్యం! అర్థం కాలేదా? అయితే, 2050 నాటికి ఆ సైబోర్గ్ సైన్యానిదే రాజ్యం అంటున్న అమెరికా ఆర్మీ రిపోర్టు గురించి తెలుసుకోవాల్సిందే. మన కళ్ల నుంచి కాళ్ల వరకు, మనసు నుంచి మెదడు వరకు అన్నింటినీ కంట్రోల్ లో పెట్టుకుంటూ శత్రువు అంతు చూసే ఆ సైబోర్గ్ సైన్యం గురించి అమెరికా కంబాట్ కేపబిలిటీస్ డెవలప్ మెంట్ కమాండ్ అయిన దేవ్ కమ్ నిపుణులు రిపోర్టు విడుదల చేశారు.

ఇటు బలగాలకు.. అటు హెల్త్ కేర్​కు

చిన్న అలికిడి జరిగినా చెవి పసిగడుతుంది. కంటికి కనిపించని టార్గెట్లనూ కనిపెడుతుంది. కండలకు అండగా నిలుస్తుంది. చేతిలోని ఆయుధాలను మైండ్ కంట్రోల్ చేసేలా న్యూరల్ పవర్​ను ఇస్తుంది. మొత్తంగా బలగాలకు సైబోర్గ్ పెద్ద బలమవుతుంది. ఇప్పటికే దీనిపై డజనుకుపైగా సైంటిస్టులు, ఆర్మీ సిబ్బంది కలిసి ఈ సైబోర్గ్ సైన్యంపై పరిశోధన చేశారు. కళ్లు, చెవులు, మెదడు, కండరాల వ్యవస్థల్లో మార్పులు చేసే వివిధ టెక్నాలజీలకు సంబంధించిన నాలుగు కేస్ స్టడీలను పరిశీలించారు. వాటి వల్ల సమాజం, యుద్ధ తంత్రాల్లో కలిగే ప్రభావాలను అంచనా వేశారు. మొత్తంగా సైన్యానికి దాని వల్ల ఎన్నెన్నో లాభాలు కలిగినా, హెల్త్ కేర్ రంగంలోనూ వాటికి డిమాండ్ ఎక్కువుంటుందని గుర్తించారు. గాయాలు, జబ్బుల వల్ల కలిగే ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఈ మనిషి-మెషీన్ టెక్నాలజీ (సైబోర్గ్)ను హెల్త్​కేర్​ మార్కెట్​ వాడుకునే అవకాశం ఉంటుందంటున్నారు. సైన్యంలో ఈ టెక్నాలజీని వాడితే యుద్ధాల్లో సైనికుల ప్రాణాలను కాపాడొచ్చని దేవ్‌‌కం నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది నైతికం కాదని కొందరు వాదిస్తున్నారు. మనసును, మెదడును ముడిపెట్టే టెక్నాలజీలను వాడుకునే ముందు ఇంకా మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ టెక్నాలజీని వాడుకున్న ఓ సైనికుడు తిరిగి మామూలు మనిషిలా బతికేందుకు అనువైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అంతేకాదు, ఈ డెడ్లీ టెక్నాలజీ వల్ల దేశ భద్రతకూ ముప్పు కలిగే అవకాశం లేకపోలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఓ సున్నితమైన ప్రదేశంలోకి కనీసం ఫోన్లు, ఇతర వస్తువులను అనుమతించనప్పుడు, ఇలాంటి సైబోర్గ్​లను ఎలా అనుమతిస్తారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సైబోర్గ్​పై నెగెటివ్ ఆలోచనలను వదిలేసి పాజిటివ్​గానే ఆలోచించాలని దేవ్​కం నిపుణులు సూచిస్తున్నారు. ఎంటర్​టైన్మెంట్ పేరిట సినిమాలు, నవలలు, ఇతర ఓపెన్ సోర్స్ మీడియాలో ఇలాంటి వాటిపై లేనిపోని కట్టు కథలు అల్లుతున్నారని అంటున్నారు. వచ్చే తరానికి ఈ సైబోర్గ్​లు మంచి అవకాశాలను ఇస్తాయంటున్నారు. కాబట్టి భావి తరాలకు తగ్గట్టు ఈ సైబోర్గ్​ సైన్యాన్ని తయారుచేయాలని సూచిస్తున్నారు.

ఇదీ సైబోర్గ్​ సైన్యం

అణువణువూ కంటి చూపులోనే

ఒక్కోసారి కంటి ముందున్న వాటినీ మనం కనిపెట్టలేం. కానీ, కనుచూపు మేరలో లేని వాటినీ ఇన్​ఫ్రారెడ్, అల్ట్రావయొలెట్ లైట్​తో మనకు కనిపించేలా చేసే కంటి ఇంప్లాంట్​ను ఇందుకోసం వాడతారు. కంటి కణజాలంపై ఈ ఇంప్లాంట్​ను పెడతారు. కనుపాప గోడల సాయంతో చుట్టుపక్కల ఉండే వాటిని అది అంచనా వేస్తుంది. ఆ డేటాను కంటి నరాల ద్వారా మెదడుకు పంపుతుంది. తర్వాత అక్కడ ఉన్నదేంటో అది ప్రాసెస్ చేసి చూపిస్తుంది. ఇటు సైన్యంతో పాటు చూపు లేనోళ్లకూ ఈ టెక్నాలజీని వాడితే మంచి ఫలితాలుంటాయని దేవ్​కం నిపుణులు చెబుతున్నారు.

కర్ణభేరిని రీప్లేస్ చేయాల్సిందే

శత్రువుల గురించి పక్కాగా తెలియాలంటే తోటి సైనికులతో కమ్యూనికేషన్ పటిష్టంగా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్నీ స్పష్టంగా వినగలగాలి. దానిని మెరుగుపరిచేదే ఈ చెవి ఇంప్లాంట్. ఈ చెవి ఇంప్లాంట్ బాగా పనిచేయాలంటే కర్ణబేరి, చెవి ఎముకను రీప్లేస్ లేదా మోడిఫై చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దాని వల్ల చాలా దూరంలో అయిన అలికిడినీ సైనికులు పసిగట్టగలుగుతారని అంటున్నారు. కోవర్ట్ (రహస్య/గూఢచర్య) సంభాషణలను న్యూరల్ సిగ్నలింగ్ ద్వారా ఇన్ ఫ్రాసోనిక్, అల్ట్రాసోనిక్ శబ్దాలను ఈజీగా వినొచ్చంటున్నారు. అంటే తక్కువ, ఎక్కువ శబ్దాలను ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా వినేసేయొచ్చని చెబుతున్నారు.

కండలకు అండగా..

యుద్ధ రంగంలో పరిస్థితులకు తగ్గట్టు కదలాల్సి ఉంటుంది. మరి, ప్రతిసారీ అంత స్థిరంగా కదలడమంటే కత్తిమీద సాములాంటిదే. బాగా అలసిపోతుంటారు సైనికులు. దాన్ని అధిగమించేందుకు పరిస్థితులకు తగ్గట్టుగా కండరాలు కదిలేలా ఓ సెన్సర్స్ వెబ్​ను చర్మం కింద అమర్చుతారు. ఆ సెన్సర్లు సెంట్రల్ కంప్యూటర్ కంట్రోలర్​కు లింక్ అయిన బట్టలు, బూట్లు, కంటి గేర్​లోని సెన్సర్లతో కనెక్ట్ అయి ఉంటాయి. బయటి పరిస్థితులకు తగ్గట్టుగా లోపల కండరాలను ఆ సెన్సర్లు కదిలిస్తుంటాయి. ఫలితంగా ఓ సైనికుడిపై పడే భారం చాలా వరకు తగ్గుతుంది.

మెదడుతో కంట్రోలింగ్

మన మైండ్ ను ఎదుటోళ్లు కంట్రోల్ చేస్తే దాన్నే హిప్నాటిజం అని పిలుస్తుంటాం కదా. అదే మన మైండ్ తో టెక్నాలజీని కంట్రోల్ చేసేదే ఈ సరికొత్త టెక్నాలజీ. ఉదాహరణకు సైనికులు ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు బయటకు గట్టిగా మాట్లాడలేరు. అలాంటప్పుడు తోటి సైనికుల మెదడులో ఏం కదులుతోందో దీనితో తెలుసుకోవచ్చు. అంతే కాదు, మెదడుతోనే ఆయుధాలను వాడేసేయొచ్చు. అందుకోసం బ్రెయిన్ లో కొన్ని ఎలక్ట్రోడ్లను పెడతారు. ఆ ఎలక్ట్రోడ్ లతోనే తోటి సైనికుల మనసులో ఏముందో తెలుసుకుంటారు. యంత్రాలు, ఆయుధాలను కంట్రోల్ చేస్తారు.

సైబోర్గ్ అంటే: ఎక్కువ కాలం పాటు స్పేస్​లో ఉండడం వల్ల శరీరంలో కలిగే మార్పులను తెలుసుకునేందుకు మాన్ ఫ్రెడ్ క్లైన్స్, నాదన్ క్లైన్​లు ఓ స్టడీ చేశారు. ఆ స్టడీలో భాగంగానే నాసా ఈ ‘సైబోర్గ్’ అనే పేరును పెట్టింది. అంటే, సైబర్ నెట్ జీవి. ఓ జీవి, మెషీన్ ను కలిపి పుట్టించినదే ఈ సైబర్ నెట్ జీవి. దానికే సైబోర్గ్ అని నాసా పేరు పెట్టిందన్నమాట.