సిటీలో సైక్లింగ్ ట్రాక్​లు నామ్ కే వాస్తే

సిటీలో సైక్లింగ్ ట్రాక్​లు నామ్ కే వాస్తే

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఏర్పాటుచేసిన సైక్లింగ్ ట్రాక్‌ల నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇతర వెహికల్స్ వాటిపై వెళ్తున్నాయని.. పార్కింగ్‌లకు వాడుతున్నారని సైక్లిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిటీలో దాదాపు 10 వేలమంది సైక్లిస్టులున్నారు. వీరిలో మూడు నుంచి నాలుగు వేల మంది వివిధ అవసరాలపై  డైలీ  సైకిల్​నే వాడుతున్నారు.  సిటీలో సైక్లింగ్ ట్రాక్‌ల నిర్వహణ సరిగా లేకపోవడం, ఉన్న వాటి మీద ఇతర వెహికల్స్ వెళ్తుండటం, కొన్ని పార్కింగ్ ఆక్రమణలకు గురవడంతో సైకిల్ నడిపేవారు ఇబ్బంది పడుతున్నారు. 

యాక్సిడెంట్లు అయితున్నయ్
వారం రోజుల కిందట గచ్చిబౌలిలో సైకిల్​పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి కారు ఢీకొట్టింది దీంతో అతడు అక్కడిక్కడే చనిపోయాడు. ఇందుకు నిరసనగా దాదాపు400ల మంది సైక్లిస్టులు గచ్చిబౌలి నుంచి జూబ్లీహిల్స్, పంజాగుట్ట, నెక్లెస్ రోడ్ మీదుగా చార్మినార్ వరకు ర్యాలీ చేపట్టారు. ఏడాది కిందట ప్యారడైజ్ దగ్గర ఆగిన ఓ సైక్లిస్టును బైక్‌ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో సైక్లిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. 6 నెలల పాటు ఐసీయూలో ఉండి చివరకు మృతి చెందాడు. ఇవే కాకుండా చాలా చోట్ల సైక్లిస్టులు ప్రమాదాలకు గురవుతున్నారు. సైక్లింగ్ ట్రాక్ పై వెళ్తే సడెన్​గా ఏ వెహికల్ వస్తుందో తెలియట్లేదని వారు చెప్తున్నారు.  సైక్లింగ్ ట్రాక్​లపై మానిటరింగ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

విదేశాల తరహాలో ఏర్పాటు చేస్తామని చెప్పి.. 
విదేశాల తరహాలో సిటీలో సైక్లింగ్ ట్రాక్​లు ఏర్పాటు చేస్తామని బల్దియా, హెచ్ఎంఏటీఏ ప్రకటించినప్పటికీ కేవలం రెండు చోట్ల మాత్రమే అవి కనిపిస్తు
న్నాయి.  కేబీఆర్ పార్కు చుట్టూ, నెక్లెస్​రోడ్​లో ఏర్పాటు చేసిన ఆ సైక్లింగ్​ ట్రాక్​లు సైతం  సైక్లిస్టులకు ఉపయోగపడట్లేదు. రోడ్లపై ఎల్లో కలర్ ట్రాక్ లైన్లు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.   మెయింటెనెన్స్​ను  పట్టించుకోవడం లేదు. విదేశాల్లో సైక్లింగ్ ట్రాక్ లను రోడ్లకు పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఆ ట్రాక్ లోకి ఇతర వెహికల్స్ వస్తే భారీగా ఫైన్లు వేస్తారు. సిటీలో అసలు సైక్లింగ్ ట్రాక్ గురించే చాలామందికి అవగాహన లేదని సైక్లిస్టులు చెప్తున్నారు. 

నో చలాన్, నో యాక్షన్ .. 
దుబాయిలోని షేక్ జాహెద్ రోడ్​లో ఉన్న సైక్లింగ్ ట్రాక్ లోకి ఇతర వెహికల్స్ వస్తే 500 దీరమ్స్(రూ.8 వేలు) ఫైన్ విధిస్తారు.  సౌదీ అరేబియాలో 500 రియాల్స్ (రూ.9వేలు) వరకు ఫైన్​తో పాటు  జైలు శిక్ష కూడా వేసే చాన్స్ ఉంది. నెదర్లాండ్​లోని ఆమ్ స్టర్ డామ్ సిటీలో సైక్లింగ్ ట్రాక్ కోసం సెపరేట్ వే ఉంటుంది.  అందులోకి ఇతరులు వస్తే వేలల్లో ఫైన్లతో పాటు కేసు ఫైల్ చేస్తారు. యూఎస్, 
న్యూజిల్యాండ్ తదితర దేశాల్లోనూ ప్రత్యేకంగా ట్రాక్​లు ఉన్నాయి. సిటీలో ఈ తరహా రూల్స్ అమలు కావడంలేదు. ఇతర వెహికల్స్ ఇష్టమొచ్చినట్లు సైక్లింగ్ ట్రాక్​లపైనే  వెళ్తున్నా అధికారులు,

ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. 
రెండేండ్లు దాటినా పనులు పూర్తి కాలె
 
దశల వారీగా సిటీలో 450 కి.మీ మేర సైక్లింగ్ ట్రాక్​లను తీసుకొస్తామని రెండేండ్ల కిందట బల్దియా, హెచ్ఎండీ, హెచ్ఎంటీఏ( హైదరాబాద్‌ యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ) ప్రకటించాయి. కానీ  ఆ దిశగా పనులు మాత్రం చేపట్టడం లేదు. పైలట్‌ ప్రాజెక్టుగా బేగంపేట మెట్రోస్టేషన్‌ నుంచి సైఫాబాద్‌ ఇక్బాల్‌ మినార్‌ వరకు 12.3 కి.మీ మేర(వన్‌ వే) సైక్లింగ్ ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి.  కానీ ఇప్పటి వరకు ట్రాక్ పూర్తి కాలేదు. ఖైరతాబాద్, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సెంటర్, కోకాపేట, ఖైరతాబాద్‌ జోన్‌లో మొత్తం 8  రహదారులను సైక్లింగ్ ట్రాక్‌లుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రముఖ ఆఫీసులు, మెట్రో రైల్వేస్టేషన్లను కలుపుతూ ఉద్యోగులకు, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఎక్కడ కూడా అందుబాటులోకి రాలేదు.

మానిటరింగ్ ఉండాలె
ఐదేండ్ల క్రితం హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ స్టార్ట్ చేశాం. సైక్లింగ్​ని ప్రమోట్ చేసుకుంటూ  యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఎంతో మంది వెహికల్స్ వదిలేసి.. సైకిల్ పై వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ సిటీలో ట్రాక్​లు  సరిగా లేకపోవడం, హెవీ ట్రాఫిక్​తో వారు ఇబ్బంది పడుతున్నారు. బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు స్పందించి వెంటనే సైక్లింగ్ ట్రాక్​లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి.  వాటిపై ఇతర వెహికల్స్ వెళ్లకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రికార్డింగ్ ఆడియోలతో 
అవేర్ నెస్ కల్పించాలి. - రవీందర్, హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ ఫౌండర్