గుజరాత్ తీర ప్రాంతంలో హైఅలర్ట్...జఖౌ పోర్టు వద్ద తీరం తాకనున్న బిపర్​జాయ్

గుజరాత్ తీర ప్రాంతంలో  హైఅలర్ట్...జఖౌ పోర్టు వద్ద తీరం తాకనున్న  బిపర్​జాయ్
  • రేపు కచ్‌‌ జిల్లా జఖౌ పోర్టు వద్ద తీరం తాకనున్న 
  • బిపర్​జాయ్ తుఫాన్​, రంగంలోకి ఎన్​డీఆర్ఎఫ్, ఎస్​డీఆర్ఎఫ్​ బృందాలు 
  • 21 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • పలు రైళ్లు రద్దు చేసిన అధికారులు

జఖౌ/అహ్మదాబాద్​: బిపర్ జాయ్ తుఫాన్ గుజరాత్ తీరంవైపు దూసుకొస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కోస్టల్ ఏరియాల్లోని 21వేల మందిని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్స్​కు తరలించారు. ఎన్​డీఆర్ఎఫ్, ఎస్​డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజల తరలింపు కొనసాగుతూనే ఉందని అధికారులు ప్రకటించారు. తీర ప్రాంతానికి 10 కిలో మీటర్ల పరిధిలో నివాసం ఉంటున్న అందరినీ సేఫ్​ ప్లేస్​కు తరలిస్తున్నట్లు వివరించారు. 15 నుంచి 17వ తేదీ వరకు నార్త్​ గుజరాత్​లోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ నెల 15న తుఫాన్ తీరందాటనుందని, ఈ నెల 16 వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. 

10 కి.మీ పరిధిలోని ఇళ్లన్నీ ఖాళీ

కచ్ జిల్లా నుంచి 6,500 మందిని, ద్వారాక నుంచి 5వేల మందిని, రాజ్​కోట్ నుంచి 4వేల మందిని, మోర్బి నుంచి 2వేల మందిని, జామ్​నగర్ నుంచి 1500 మందిని, జునాగఢ్ జిల్లా నుంచి 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వివరించారు. రాజ్​కోట్ జిల్లా జస్దన్ మండలంలో తుఫాన్​ కారణంగా ఒకామె చనిపోయిందన్నారు. బైక్​పై వెళ్తున్నప్పుడు బలమైన గాలుల కారణంగా కిందపడటంతో వర్ష అనే మహిళ చనిపోయిందని తెలిపారు. తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు.

ఆయిల్ రింగ్​లో 50 మందిని కాపాడిన కోస్ట్​గార్డ్

ద్వారకలోని ఓఖా తీరానికి 40 కి.మీ దూరంలో ఉన్న ‘కీ సింగపూర్’ ఆయిల్​ రింగ్​లో పని చేస్తున్న 50 మందిని కోస్ట్​గార్డ్ కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఐదుగురు కేంద్ర మంత్రులు మాన్సుఖ్​మాండవియా, పురుషోత్తమ్ రూపాలా, దర్శన జర్దోష్, దేవుషిన్ చౌహాన్, మహేంద్ర ముంజ్పారా గుజరాత్​లోని వివిధ జిల్లాకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. షెల్టర్​ హోమ్స్​లో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామని మాన్సుఖ్ మాండవీయ వివరించారు. కాగా, సైక్లోన్ కారణంగా గుజరాత్​లో భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.

పలు రైళ్లు రద్దు.. 

తుఫాన్ కారణంగా 60కిపైగా రైళ్లను రద్దు చేసినట్లు వెస్టర్న్ రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. రాబోయే మూడు రోజుల్లో మరికొన్ని రైళ్లు రద్దు చేయడం, దారి మళ్లించడం చేస్తామన్నారు.