తీరం దాటిన దానా తుఫాన్.. నెక్ట్స్ జరగబోయేది ఇదే..

తీరం దాటిన దానా తుఫాన్.. నెక్ట్స్ జరగబోయేది ఇదే..

భువనేశ్వర్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ను వణికిస్తున్న దానా తుఫాన్ తీరం దాటింది. ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల సమయంలో తుఫాన్ తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో భీకర గాలులు ఉంటాయని, గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటడంతో ఈ ప్రభావంతో ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, జగత్సింగ్పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

దానా తుపాను కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. రోడ్లు జలమయం అయి.. విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని .. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఐఎండీ వెల్లడించింది. మరీ ముఖ్యంగా పాత, శిథిలావస్తకు చేరుకున్న ఇళ్లల్లో ఉండకూడదని సూచించింది. తుఫాన్ ప్రభావంతో ఒడిశాలో చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. ఒడిశాలోని 11 తీర ప్రాంత జిల్లాల నుంచి 5.84 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్టోబర్ 25 (శుక్రవారం) ఉదయం వరకూ తుఫాన్ ప్రభావం ఉంటుందని.. సాయంత్రానికి క్రమంగా ఈదురు గాలుల ప్రభావం తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది.