
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం అల్ప పీడనంగా మారే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి ఈ వాయు గుండం తుఫానుగా మారి గంటకు 80 కిలో మీటర్ల వేగంతో తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. ఈ తుఫానుకు బురేవి అని నామకరణం చేశారు. కన్యాకుమారికి ఆగ్నేయ దిశలో 930 కి.మీ.ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇండియా మెటెరోలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) ప్రకారం.. బురేవి తుఫాను వాయువ్య దిశలో ప్రయాణిస్తోంది. బుధవారం రాత్రి శ్రీలంకలోని ట్రింకోమలీ తీరాన్ని బురేవి దాటే అవకాశం ఉంది. ఆ తర్వాతి రోజు ఉదయానికి భారత తీరాన్ని చేరుకోవచ్చు. ఈ తుఫాను వల్ల కేరళ, తమిళనాడుల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురవొచ్చని ఐఎండీ పేర్కొంది.