ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్ గండం : కోస్తా, రాయలసీమతోపాటు తెలంగాణాలోనూ వర్షాలు

ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్ గండం : కోస్తా, రాయలసీమతోపాటు తెలంగాణాలోనూ వర్షాలు

ఏపీకి తుఫాన్ ముప్పు ముంచుకొస్తుంది.. 2024, అక్టోబర్ 12వ తేదీన.. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుంది. అల్పపీడనం బలపడి.. వాయుగుండం.. తుఫాన్ గా మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది విశాఖ వాతావరణ కేంద్రం.

బంగాళాఖాతంలోని తుఫాన్ ప్రభావంతో.. అక్టోబర్ 14 నుంచి 16వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. అక్టోబర్ నెలలో బంగాళాఖాతంలో తుఫాన్ లు ఏర్పడటం సహజమే. 

తెలంగాణలోనూ వర్షాలు

ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు పడనున్నట్లు ఏపీ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ 14 నుంచి 16వ తేదీ మధ్య మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వివరించింది. 

ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలోనూ వర్షాలు మొదలవుతాయని.. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడనున్నాయి వాతావరణ శాఖ వెల్లడించింది.