తమిళనాడు గజగజ.. విల్లుపురం, కృష్ణగిరి జిల్లాల్లో 300 ఏండ్లలో అతి భారీ వర్షాలు

 తమిళనాడు గజగజ.. విల్లుపురం, కృష్ణగిరి జిల్లాల్లో 300 ఏండ్లలో అతి భారీ వర్షాలు
  • పలు జిల్లాలలో ముంచెత్తిన వరద
  • కొట్టుకుపోయిన వాహనాలు
  • నిలిచిపోయిన రైళ్లు..జనజీవనం అస్తవ్యస్తం
  • పుదుచ్చేరిలోనూ వర్ష బీభత్సం

విల్లుపురం(తమిళనాడు): తమిళనాడును ఫెయింజల్​ తుఫాన్​ వణికించింది. తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకిన ఫెయింజల్​ తుఫాన్  తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో సోమవారం తమిళనాడులోని విల్లుపురం, కృష్ణగిరితోపాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. భయానక వరదలు సంభవించాయి.  లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీటమునిగి ఏ ప్రాంతం చూసినా చెరువులను తలపించాయి. వరదల్లో బైక్​లు, కార్లతోపాటు కొన్నిచోట్ల బస్సులు కూడా కొట్టుకుపోయాయి. వాహనాలన్నీ 2 అడుగుల మేర నీటమునిగాయి. వరద ఉధృతికి పలు వంతెనలు దెబ్బతిని, రవాణా స్తంభించింది. తెన్పెన్నై నది ఉధృతంగా ప్రవహించడంతోపాటు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. 

విల్లుపురంలోని అరగందనల్లూర్‌‌‌‌‌‌‌‌లో 4 అడుగులకు పైగా నీటిమట్టం పెరగడంతో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. ఉత్నంగరై నుంచి కృష్ణగిరికి, తిరువణ్ణామలైకు ప్రయాణించే రహదారిపై భారీగా వరదనీరు నిలవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో పంటలన్నీ నీటమునిగాయి. వర్ష ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్​ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కాగా, గత 300 ఏండ్లలో చూడని వానలు కురిసినట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారినట్టు వెల్లడించారు. నీలగిరి, ఈరోడ్‌‌‌‌‌‌‌‌, కోయంబత్తూర్‌‌‌‌‌‌‌‌, దిండిగల్‌‌‌‌‌‌‌‌, కృష్ణగిరి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

స్తంభించిన రవాణా

విల్లుపురంలోని విక్రవాండి, ముండియంపాక్కం మధ్య రైల్వే వంతెనపై నీరు ప్రమాదస్థాయికి చేరడంతో ఆ మార్గంలో రైలు సేవలను దక్షిణ రైల్వే తాత్కాలికంగా నిలిపివేసింది. ఎక్స్​ప్రెస్​, సూపర్​ఫాస్ట్​ రైళ్లతోసహా సర్వీసులన్నీ రద్దయ్యాయి. ఆ మార్గం గుండా వెళ్లాల్సిన పలు రైళ్లను  దారి మళ్లించారు.  దీంతో వదలాది మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో తీవ్ర ఇబ్బందులుపడ్డారు. జనాలంతా పోటెత్తడంతో బస్​ స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. వరద ఉధృతికి బ్రిడ్జి కొట్టుకుపోవడంతో తిరువణ్నమలై జిల్లాలోని ఆరణి సమీపంలోని పలు గ్రామాలకు లింక్ తెగిపోయింది. తిండివనం సమీపంలోని కరుణాపురం వద్ద ఉన్న వంతెనతో సహా ఇతర చోట్ల బ్రిడ్జిలు నీటమునిగాయి. దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జింజి ప్రభుత్వ దవాఖానలోకి నీరుచేరడంతో రోగులను అధికారులు ఇతర దవాఖానలకు తరలించారు.

తుఫాన్​ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు

విల్లుపురంతోపాటు తుఫాను ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఆర్మీ రంగంలోకి దిగింది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి సహాయ సామగ్రి అందజేశారు. తగిన ఏర్పాట్లు చేశారు. విల్లుపురంలోని వరద పరిస్థితులను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ సమీక్షించారు. శిబిరాల్లోని బాధితులతో మాట్లాడి, వారికి అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సామగ్రి పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మందిని 147 శిబిరాలకు తరలించి, వారికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు స్టాలిన్​ తెలిపారు. అలాగే, క్రిష్ణగిరి జిల్లాలో ఏఐఏడీఎంకే చీఫ్​ కె. పలనిస్వామి పర్యటించారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు, ప్రజలకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

పుదుచ్చేరిని కుదిపేసిన వర్షం

ఫెయింజల్​ తుఫాన్ ఎఫెక్ట్​తో పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురిశాయి. కృష్ణానగర్​లోని కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం దాదాపు 5 అడుగులకు చేరుకున్నది. దాదాపు 500 ఇండ్లు నీటమునిగాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన ఇండియన్​ ఆర్మీ వరదల్లో చిక్కుకున్న 100 మందిని కాపాడింది. తుఫాన్ కారణంగా పుదుచ్చేరిలో 48 శాతం వర్షపాతం నమోదైందని సీఎం రంగస్వామి తెలిపారు. భారీ వర్షాలకు పుదుచ్చేరిలో దాదాపు 10 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. రైతులకు హెక్టార్​కు రూ.30 వేల సహాయం అందిస్తామని చెప్పారు. వరదల వల్ల 50 పడవలు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.10వేల సహాయాన్ని ప్రకటించామని తెలిపారు. రేషన్ ​కార్డు దారులందరికీ రూ.5 వేల సాయం అందిస్తామని తెలిపారు.