చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు

చెన్నై  వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు

చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు తడిపి ముద్ద చేస్తున్నాయి. అసలే చలికాలం, పైగా గత రెండు, మూడు రోజులుగా ఎడతెరపి లేని వర్షాలతో తమిళనాడు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఫెంగల్ తుఫాన్ తమిళనాడు వైపుగా దూసుకొస్తుంది. నవంబర్ 27, రాత్రి 8 గంటల సమయానికి ఇది పెను తుఫాన్గా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. డిసెంబర్ 1న ఈ ఫెంగల్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

తమిళనాడులోని నాగపట్నంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా చెన్నైలోని పట్టినపక్కం బీచ్లో విపరీతమైన వేగంతో గాలులు వీచాయి. తమిళనాడులోని తంజావూర్, నాగపట్నం, తిరుచ్చి, తిరువరూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 1 వరకూ తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

మరీ ముఖ్యంగా.. ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావం వల్ల చెన్నై నగరంలో కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. చెన్నై నగరానికి నవంబర్ 28న ఆరెంజ్ అలర్ట్, నవంబర్ 29, నవంబర్ 30న ఎల్లో అలర్ట్ను ఐఎండీ జారీ చేసింది. నవంబర్ 28న తమిళనాడులోని కాంచీపురం, చెంగలపట్టు, విల్లుపురం, కడలూరు జిల్లాల్లో.. పుదుచ్చేరిలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో, తిరువళ్లూర్, రాణీపేట్, తిరువణ్ణమలై, కాళ్లకురిచ్చి, పెరంబలూర్, అరియలూర్, పుదుకొట్టై, తంజావూర్, తిరువరూర్, నాగపట్నం, మయిలదుతురై, కారైకల్ ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నవంబర్ 29న చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పేట్, రాణీపేట్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, వెల్లూరులోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరువణ్ణమలై, విల్లుపురం, కడలూరు, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

నవంబర్ 30న చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పేట్, రాణీపేట్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వెల్లూరు, తిరువణ్ణమలై, విల్లుపురం, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

డిసెంబర్ 1: చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పేట్, రాణీపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు
డిసెంబర్ 2: కాంచీపురం, తిరువళ్లూర్, వెల్లూరు, తిరుపత్తూర్, తిరువణ్ణమలై, కృష్ణగిరి, ధర్మపురి, రాణీపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు