- 24 గంటల్లో 46 సెంటీమీటర్ల వాన
- జనజీవనం అతలాకుతలం.. కాలనీల్లోకి భారీ వరద
- రంగంలోకి ఆర్మీ.. క్యాంప్‌లకు బాధితుల తరలింపు
- తమిళనాడులోనూ వర్షాలు.. చెన్నైలో ముగ్గురు మృతి
పుదుచ్చేరి/చెన్నై: ఫెయింజల్ తుఫాన్ పుదుచ్చేరిలో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇక్కడ 24 గంటల్లోనే 46 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 20 ఏండ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని వాతావరణ శాఖ ఆదివారం పేర్కొంది. గతంలో 2004 అక్టోబర్ 31న 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలాచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. చాలా ప్రాంతాల్లో కాలనీల్లోకి వరద చేరింది. జనం బయటకు రాలేక ఇండ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఆర్మీ రంగంలోకి దిగి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రక్షించింది. బోట్ల సహాయంతో దాదాపు 200 మందిని షెల్టర్ క్యాంప్ లకు తరలించింది. వర్షాలు, వరదలకు ట్రాన్స్ పోర్టు సర్వీసులకు బ్రేక్ పడింది. కాలనీల్లో పార్క్ చేసిన వాహనాలు నీట మునిగాయి. పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సహాయక చర్యల్లో పాల్గొని, బాధితులకు ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
విల్లుపురంలో 49 సెంటీమీటర్ల వర్షం..
ఫెయింజల్ ప్రభావంతో తమిళనాడులోనూ భారీ వర్షాలు కురిశాయి. విల్లుపురం, కద్దలూరు, చెంగల్ పట్టు జిల్లాల్లో పెద్ద వానలు పడ్డాయి. విల్లుపురం జిల్లాలోని మైలంలో అత్యధికంగా 49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విల్లుపురంలో ఊహించని రీతిలో వర్షాలు కురిశాయని సీఎం స్టాలిన్ ఆదివారం తెలిపారు. ఈ జిల్లాకు 12 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ను జిల్లాకు పంపించామని చెప్పారు.
విల్లుపురం, కద్దలూరు, చెంగల్ పట్టు జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు టీమ్స్ ను పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొన్నారు. ‘‘చెన్నైలో పరిస్థితి కుదుటపడింది. లోతట్టు ప్రాంతాల్లోని వరదను మోటార్ల ద్వారా తొలగించాం. 32 షెల్టర్ క్యాంప్స్ లో వెయ్యి మందికి పైగా వసతి కల్పించాం. వాళ్లకు ఫుడ్, వాటర్ అందజేస్తున్నాం’’ అని వివరించారు.
ఇండిగో ఫ్లైట్‌కు తప్పిన ప్రమాదం..
చెన్నైలో వర్షాలకు ముగ్గురు చనిపోయా రు. వాళ్లు వరదల వల్ల విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. 16 గంటల మూసివేత తర్వాత శనివారం అర్ధరాత్రి ఒంటిగంటకు చెన్నై ఎయిర్ పోర్టును ఓపెన్ చేశారు. కానీ చాలా వరకు ఫ్లైట్స్ రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. కాగా, ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. శనివారం మధ్యాహ్నం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా, బలమైన గాలులు వీయడంతో నియంత్రణ కోల్పోయింది.
ఈ క్రమంలో పైలెట్లు అప్రమత్తమై, విమానాన్ని ల్యాండ్ చేయకుండా తిరిగి గాల్లోకి తీసుకెళ్లడం తో ప్రమాదం తప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ముంబై–చెన్నై విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగిందని పేర్కొంది. ఆ తర్వాత విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందని తెలిపింది.