- కొన్ని గంటల పాటు ఎయిర్ పోర్టు క్లోజ్
- స్కూళ్లు, కాలేజీలకు సెలవు
చెన్నై/పుదుచ్చేరి: ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ఫెయింజల్ ప్రభావంతో చెన్నై సహా తీరప్రాంత జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం రాత్రి చిరుజల్లులతో మొదలై.. శనివారం బలమైన గాలులతో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెన్నైలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. సబ్ వేలు మునిగిపోయాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వర్షాల కారణంగా రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
కొన్ని లోకల్ రైళ్లను బంద్ చేశారు. మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. అలాగే వరద కారణంగా చెన్నై ఎయిర్ పోర్టులో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వీసులన్నీ నిలిపివేశారు. కొన్ని విమానాలను బెంగళూరు, తిరుచిరాపల్లికి మళ్లించారు. 18 ఫ్లైట్లను రద్దు చేయగా, 12 ఫ్లైట్లు ఆలస్యంగా నడిచాయి. రాష్ట్రంలో పరిస్థితిపై అధికారులతో సీఎం స్టాలిన్ రివ్యూ చేశారు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం షెల్టర్ క్యాంప్స్ ఏర్పాటు చేశామని, ఆహారం పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. కాగా, 22 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తెలిపింది. 1,686 మోటార్లతో లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరదను తొలగిస్తున్నామని చెప్పింది.
విద్యాసంస్థలకు సెలవు..
భారీ వర్షాలతో చెన్నై వాసులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో తమ కార్లు, బైక్ లను సేఫ్ ప్లేసులలో పార్క్ చేస్తున్నారు. కొన్నిచోట్ల ఫ్లైఓవర్లపై పెద్ద ఎత్తున కార్లను పార్క్ చేశారు. సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నేపథ్యంలో ప్రజలను బీచ్‌లకు అనుమతించడం లేదు. మెరీనా, మామల్లాపురం బీచ్‌లకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. మరోవైపు విద్యాసంస్థలకు ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది.
ఐటీ ఎంప్లాయ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు అనుమతివ్వాలని కంపెనీలకు సూచించింది. కాగా, చెన్నై, తిరువల్లూరు, చెంగల్ పట్టు, కాంచీపురం, విలుప్పురం, కళ్లకురిచి, కద్దలూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
పుదుచ్చేరిలోనూ..
పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫెయింజల్ తుఫాన్ ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని 12 లక్షల మంది ప్రజలకు అధికార యంత్రాంగం అలర్ట్ మెసేజ్‌లు పంపింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కాగా, పుదుచ్చేరికి కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి..
చెన్నైలో కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి చనిపోయాడు. ఏటీఎం సెంటర్ దగ్గర వరదలో అతని డెడ్ బాడీ పడి ఉంది. ఏటీఎం సెంటర్ లో వరద చేరిందని, కరెంట్ షాక్‌తో చనిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు.