
హైదరాబాద్, వెలుగు: ఏపీలో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సోమవారం, మంగళవారం ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని.. రాయలసీమలోని చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాలలోనూ భారీ వానలు కురుస్తాయని చెప్పింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముందస్తు చర్యల కోసం సంబంధిత జిల్లాల యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణ కోస్తా, -తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు, రైతులు కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.