ఆఫ్రికాలోని మలావి దేశంలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి దాదాపు 100 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటివరకు 60 మంది మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. నెల రోజుల వ్యవధిలో ఫ్రెడ్డీ తుపాను ఆఫ్రికాను అతలాకుతలం చేయడం ఇది రెండోసారి.
చెట్లు కూలిపోయి, కొండచరియలు విరిగిపడిన ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి... చికిత్స అందిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారు, గాయపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉందని మలావి విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.
ఫ్రెడ్డీ తుపానుతో నదులు పొంగిపొర్లుతున్నాయి. నీటి ప్రవాహంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల భవనాలు కూలిపోతున్నాయి. తుపాను ధాటికి దక్షిణ, మధ్య ఆఫ్రికాలోని ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షంతో కూడిన గాలులు తీవ్రంగా వీస్తోండడంతో దక్షిణ, మధ్య ఆఫ్రికాలో సహాయక చర్యలు చేపడుతున్న ఆటంకం ఏర్పడుతోంది. ఇక్కడ ఎక్కువగా మట్టి నివాసాలే ఉండడంతో అవి ఏ క్షణంలోనైనా కూలిపోయి ప్రజలపై పడే అవకాశం ఉందంటున్నారు స్థానిక పోలీసు అధికారులు.