Weather : తీవ్ర తుఫాన్ గా హమూన్.. ఏడు రాష్ట్రాలకు భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర తుఫాన్ గా మారింది. దీంతో దీనికి హమూన్ అనే పేరు ఖరారు చేశారు. అక్టోబర్ 24వ తేదీ ఉదయం ఆరు గంటల సమయానికి ఉత్తర ఈశాన్య దిశగా.. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 25వ తేదీ సాయంత్రానికి తుఫాన్ హమూన్.. బంగ్లాదేశ్ దేశంలోని చిట్టగాంగ్ సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో.. గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

తుఫాన్ హమూన్ ప్రభావం భారతదేశంపైనా ఉంటుందని వెల్లడించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అయిన మణిపూర్, త్రిపుర, మిజోరాం, అసోం, మేఘాలయ రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ ఏడు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు అంటే.. 24, 25, అక్టోబర్ 26వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు ప్రకటించింది. 

బంగాళాఖాతంలోకి మత్సకారులు వేటకు వెళ్లొద్దని.. రెండు రోజుల వరకు ఇవే హెచ్చరికలు కొనసాగుతాయని తెలిపింది వాతావరణ శాఖ. హమూన్ తీవ్ర తుఫాన్ గా మారటంతో.. బంగ్లాదేశ్ దేశం కూడా అప్రమత్తం అయ్యింది. సహాయ చర్యలు చేపట్టింది. తీర ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తుంది. తుఫాన్ తీరం దాటే సమయంలో విధ్వంసం జరగొచ్చని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని.. సముద్రానికి దగ్గరలో ఉండే ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని వార్నింగ్స్ ఇచ్చింది బంగ్లాదేశ్ ప్రభుత్వం.

తీవ్ర తుఫాన్ హమూస్.. మన దేశం నుంచి వెళ్లిపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అల్పపీడనం సమయంలో ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తుఫాన్ ఉండొచ్చు అని భావించినా.. అలాంటిది ఏమీ లేకుండా.. బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవటంతో పెద్ద గండం తప్పింది.

ALSO READ :- మాస్ బియాండ్ యూనివర్స్ .. మెగా156 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్