న్యూఢిల్లీ: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మొదలైన 'హమూన్' తుఫాను తీవ్రరూపం దాల్చింది. దాంతో మన దేశంలోని ఏడు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలపై తుఫాను ప్రభావం పడే ప్రమాదం ఉందని ఇండియా మెటీరోలాజికల్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. తుఫాను ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు 290 కి.మీ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘకు 270 కి.మీ, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు -నైరుతి దిశలో 230 కి.మీ దూరంలో ఉందని వివరించింది. 'హమూన్' బుధవారం సాయంత్రం ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. 'హమూన్' బంగ్లాదేశ్ తీరం దాటడానికి ముందే బలహీనపడే చాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న 'హమూన్' 6 గంటల్లో గంటకు 18 కిలో మీటర్ల వేగంతో ఈశాన్య దిశగా కదిలింది. దీని ప్రభావంతో దేశంలోని పలు ప్రదేశాల్లో మేఘావృతమైన వాతావరణం, తీరం వెంబడి బలమైన గాలులు వీచాయి. బంగ్లాదేశ్ తీరం దాటే ముందు గాలి వేగం గంటకు 65 నుంచి 85 కి.మీ వరకు ఉండనుంది.
ఐఎండీ హెచ్చరికలు
'హమూన్' తుఫాను కారణంగా సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది. తీరం వెంబడి ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ ఏడు రాష్ట్రాల్లోని మత్స్యకారులెవరూ బంగాళాఖాతంలోకి వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. మణిపూర్, మిజోరాం, దక్షిణ అస్సాం, మేఘాలయలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా..అరేబియా సముద్రంలో మొదలైన 'తేజ్' అనే మరో తుఫాను ఆదివారం తీవ్ర రూపం దాల్చింది. 'తేజ్' యెమెన్ తీరాన్ని దాటాక బలహీనపడింది. ఇది మరో 6 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ తుఫానుగా బలహీనపడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.