తెలుగు రాష్ట్రాలకు మండే ఎండల నుండి కాస్త రిలీఫ్ దక్కింది. గత కొద్దీ రోజులుగా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. తీవ్రమైన ఎండలతో అల్లాడిన జనాలు వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు. ఈ వర్షాలు ఇంకొన్ని రోజుల పాటు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22నాటికి బంగాళాకాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. ఇది మే 24నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, సముద్ర మట్టానికి 3.1కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ కారణంగా ఏపీ, తెలంగాణాలో ఈ నెల 23వరకు ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాల విషయంలోనూ గుడ్ న్యూస్ చెపింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ఇవి చురుగ్గా కదులుతున్నాయని, రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై విస్తరిస్తామని తెలిపింది వాతావరణ శాఖ.