ఒక్క తుఫాన్ కాంగ్రెస్​ను కూల్చేసింది..

 

ఇరవై ఏళ్ల క్రితం సముద్ర తీర రాష్ట్రం ఒడిశాని ముంచెత్తిన భారీ తుఫాన్​ కనీవినీ ఎరగని నష్టాన్ని మిగిల్చింది. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు లక్షలాదిమంది జీవితాలను తలకిందులు చేశాయి. ప్రకృతి విపత్తు వల్ల పది వేల మందికి పైగా చనిపోయారు. ఆ సూపర్​​ సైక్లోన్​ ఒడిశాలో కాంగ్రెస్​కి భవిష్యత్​ లేకుండా చేసింది. అప్పుడు రాష్ట్రంలో పవర్​లో ఉన్న ఆ పార్టీని రాజకీయంగా కోలుకోలేనంత దెబ్బతీసింది.

1999లో తుఫాన్​కి ముందు, తర్వాత తీసుకోవాల్సిన చర్యల విషయంలో కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.  ‘ప్రకృతి కన్నెర్ర చేయటంతో సర్వం కోల్పోయి జనం సర్కారు అండ కోసం ఎదురుచూస్తుంటే అధికారంలో ఉన్నోళ్లు ఏమీ పట్టనట్లు సైలెంట్​గా ఉండిపోయారు. పైగా సీఎం గిరిధర్​ గమాంగ్​ని దించేసి ఆ కుర్చీని సొంతం చేసుకోవాలని పోటీ పడ్డారు. ఓటేసి గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేతలు చేయాల్సిన పని ఇదేనా’ అని సీనియర్​ జర్నలిస్ట్​ సందీప్​ సాహూ నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.

ప్రకృతి కోపానికి పార్టీ కల్చర్ తోడైంది​

ఒడిశాలో అప్పటికే హస్తం పార్టీ చాలా వరకు అవినీతితో మాసిపోయింది. దీనికితోడు లీడర్లు గ్రూపు రాజకీయాల్లో మునిగారు. నేతల వ్యవహారశైలితోపాటు కాంగ్రెస్​ హైకమాండ్​ తీరు కూడా ప్రతికూలంగా మారిందని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు.  అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే ముఖ్యమంత్రులను తరచూ మార్చే పద్ధతిని కాంగ్రెస్‌ పాటించింది. ‘రాష్ట్రాల్లో మా​ పార్టీ ఏడాదికొక సీఎంను మార్చేది. కొత్త ముఖ్యమంత్రి ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు సాధించటానికి ఛాన్స్​ దొరికేది కాదు. పాలన కుంటుపడేది. లా అండ్​ ఆర్డర్ దరిద్రంగా తయారయ్యేది’ అని కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ ఒకరు తెలిపారు.

‘హస్తం’​ పతనం ప్రారంభం

1995 శాసన సభ ఎన్నికల్లో 80 సీట్లతో అధికారం చేపట్టిన హస్తం పార్టీ… ఆ తర్వాత ఎలక్షన్‌ (2000)లో తగిన మూల్యం చెల్లించుకుంది. ఈసారి కేవలం 26 స్థానాలతో సరిపెట్టుకుంది. మొత్తం 146 సీట్ల అసెంబ్లీలో ఎన్డీయే తరఫున  బీజేడీ 68 చోట్ల,  బీజేపీ 38 సెగ్మెంట్లలో నెగ్గాయి.  ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే 1999 నుంచి 2019 వరకు ఒడిశాలో నాలుగు సార్లు తుఫాన్లు వచ్చినా ఆ రాష్ట్రం కిందో మీదో పడి ముందుకు సాగుతోంది.  కానీ,  కాంగ్రెస్​ పార్టీ మాత్రం ఒడిశాలో అంతకంతకూ దిగజారుతోంది.

మరో వైపు సీఎం నవీన్​ పట్నాయక్​ తుఫాన్ల సమయాల్లో కాంగ్రెస్​ పార్టీ మాదిరిగా కాకుండా ప్రభుత్వం యంత్రాంగాన్ని అలర్ట్​గా, యాక్టివ్​గా ఉంచుతున్నారు. ఆయన సీఎం అయ్యాక 2013లో ఫైలిన్​ సైక్లోన్​ వచ్చింది. 1999లో వచ్చిన భారీ తుఫాన్​ తర్వాత ఇదే తీవ్రమైన ప్రకృతి విపత్తు. ఈ ‘సూపర్​ సైక్లోన్‌’ కూడా 2014 అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు వచ్చింది. ఈస్టర్న్​ ఇండియాలో అతి పెద్ద పండుగ అయిన దుర్గా మాత పూజోత్సవాల​ సమయంలో ఫైలిన్​ ఎటాక్​ చేయగా నవీన్​ సర్కారు అప్రమత్తంగా వ్యవహరించింది.

నవీన్​ సర్కార్​కి ప్రశంసలు

ఫైలిన్​ తుఫాన్​కి కొన్ని గంటల ముందే లోతట్టు ప్రాంతాల్లోని 12 లక్షల మందిని సేఫ్​ ఏరియాలకు తరలించారు. సీఎం నవీన్​ పట్నాయక్​ సైతం ఫీల్డ్​కి వెళ్లి రిలీఫ్​ ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తీసుకున్నారు. ఈ తుఫాన్‌లో 44మంది మాత్రమే చనిపోయారు.  లక్షల మంది ప్రాణాలను కాపాడటంలో ఒడిశా గవర్నమెంట్​ చూపిన చొరవకి నేషనల్​, ఇంటర్నేషనల్​ లెవల్​లో ప్రశంసలు దక్కాయి.

1999లో రాష్ట్రంలో తుఫాన్​ హెచ్చరికల జారీకి సరైన వార్నింగ్​ సిస్టమ్స్​ ఉండేవి కాదు.  నవీన్​ పట్నాయక్​ పవర్​లోకి వచ్చాక డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ని బలోపేతం చేశారు. తుఫాన్ల సందర్భాల్లో టెలికం, రోడ్లు, సంబంధిత డిపార్ట్​మెంట్లన్నీ క్షణాల్లో స్పందించేలా తీర్చిదిద్దారు. సైక్లోన్​ వార్నింగ్​ సిస్టం అద్భుతంగా పని చేస్తోంది. తుఫాన్​ సమాచారాన్ని పక్కాగా అందిస్తోంది.

గతంలో.. తుఫాన్​ ముగిసిన వారం తర్వాత కూడా ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవటానికి వీలుండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితిని నవీన్​ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. 2014లో హుద్​హుద్​ తుఫాన్​ సమయంలోనూ పకడ్భందీగా పనిచేసింది.

మార్పు కోరిన జనం

1995 నుంచి 1999 చివర వరకు మొత్తం అయిదేళ్లలోనూ ఒడిశాలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని కాంగ్రెస్‌ మార్చేసింది. జె.బి.పట్నాయక్‌, గిరిధర్‌ గమాంగ్‌, హేమానంద్‌ బిశ్వాల్‌ సీఎంలయ్యారు.  ఒడిశాలో తుఫాన్‌ సంభవించే సమయానికి వాజపేయి ప్రధానిగా,  గిరిధర్‌ గమాంగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు.  లోక్‌సభ సభ్యుడిగా ఉన్న గమాంగ్‌ని కాంగ్రెస్‌ పార్టీ ఒడిశాకి పంపించింది. ఆయన ఎంపీగా ఉంటూ లోక్‌సభకి చక్కర్లు కొట్టేవారు. వాజపేయి ప్రభుత్వాన్ని ఒక్క ఓటు పడగొట్టిన ఘనత గమాంగ్‌దే.  ఆ దెబ్బకి లోక్‌సభ మధ్యంతర ఎన్నికలు రాగా,  కాంగ్రెస్‌ బలం రెండు సీట్లకు పడిపోయింది. 1996 ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌, 1998లో నలుగుర్ని, 1999లో ఇద్దరినీ మాత్రమే సాధించగలిగింది.

ఎన్నికలు ముగిసేసరికి అక్టోబర్‌ చివరలో ఒడిశాని తుఫాన్‌ చట్టుముట్టింది. 11 రోజులపాటు సాగిన తుఫాన్‌ అల్లకల్లోలం ఆ రాష్ట చరిత్రలోనే చాలా పెద్దది. దాదాపు 20 లక్షల ఇళ్లు నేలమట్టమయ్యాయి. 10వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కోటీ పాతిక లక్షల మంది వరకు నిరాశ్రయులయ్యారు. ఒక్క జగత్‌సింగ్‌ పూర్‌ జిల్లాలోనే 8,1119 మంది మరణించారు. దీంతో గమాంగ్‌ని దింపేసి, హేమానంద్‌ బిశ్వాల్‌ని గద్దెనెక్కించింది కాంగ్రెస్‌ పార్టీ.  ఆ తర్వాత రెండు నెలలకే (2000 ఫిబ్రవరిలో) రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటివరకు కాంగ్రెస్​ పార్టీ లీడర్ల వేషాలను గమనించి, వాళ్లపై పీకల దాకా కోపాన్ని పెంచుకున్న ప్రజలు ప్రభుత్వంలో మార్పు కావాలని బలంగా కోరుకున్నారు.  మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ కొడుకు నవీన్‌ పట్నాయక్‌ స్థాపించిన బిజూ జనతా దళ్​ (బీజేడీ) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.  తద్వారా ఒడిశా రాజకీయాల్లో సరికొత్త చాప్టర్​ను ప్రారంభించింది.

ఫొనికి ముందే 2019 ఎన్నికలు 

ఫైలిన్​, హుద్​హుద్ తుఫాన్లకు ముందు, తర్వాత పరిస్థితులను బాగానే డీల్​ చేసిన నవీన్​ పట్నాయక్​ ప్రభుత్వం 2018లో తిత్లి, 2019లో ఫొని సైక్లోన్ల సమయాల్లో కొంచెం తడబడింది. ఈ ఏడాది మే మొదటివారంలో వచ్చిన ఫొని తుఫాన్ వల్ల 64 మంది చనిపోయారు.​ ఆ సైక్లోన్​ తీరం దాటి నెల రోజులు పూర్తైనా ఒడిశాలోని 14 ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు.

ఒడిశా అసెంబ్లీ ఎన్నికలను 2019 జనరల్​ ఎలక్షన్​తోపాటే నాలుగు దశల్లో (ఏప్రిల్​ 11, 18, 23, 29 తేదీల్లో) నిర్వహించారు. ఎలక్షన్​ పూర్తైన నాలుగైదు రోజులకు ఫొని తుఫాన్​ ముంచెత్తింది. ఎన్నికల హడావుడిలో ఉన్న నవీన్​ పట్నాయక్​ సర్కారు సైక్లోన్​కి సంబంధించిన ముందస్తు చర్యలను సరిగా చేపట్టలేదనే టాక్​ వినిపించింది. అందువల్లే 50 మందికిపైగా చనిపోయారని, 1.65 కోట్ల మంది సర్వం కోల్పోయారని కాంగ్రెస్​ విమర్శిస్తోంది. అయినప్పటికీ కాంగ్రెస్‌ని 1999 నాటి తుఫాన్‌ భూతం వెంటాడుతూనే ఉంది. ఆ పార్టీ ఒక్కసారి  చేసిన తప్పిదానికి 20 ఏళ్లుగా నష్టపరిహారం చెల్లిస్తోంది.