- కాంచీపురం, చెంగలపట్టు, తిరువల్లూర్, కడ్డలూరు జిల్లాల్లోనూ కుండపోత
- కాల్వలను తలపిస్తున్న రోడ్లు.. నడుము లోతు నీళ్లు.. లోతట్టు కాలనీలు మునక
- చెన్నైలోని పెరుంగుడిలో 24 గంటల్లో 29 సెంటీమీటర్ల వర్షపాతం
- వేలచేరి ఏరియాలో భారీ గొయ్యి.. చిక్కుకుపోయిన పలువురు
- నేడు తీరం దాటనున్న మిచాంగ్ తుఫాను.. అడ్వైజరీ జారీ చేసిన సర్కారు
చెన్నై : తమిళనాడులో కుండపోత వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో చెన్నై, దాని చుట్టుపక్క జిల్లాల్లో వరద పోటెత్తి.. జనజీవనం స్తంభించిపోయింది. నడుము లోతు నీటితో రోడ్లు కాలువలను తలపిస్తుండగా.. భారీగా నీళ్లు చేరి ఎయిర్‌పోర్టు చెరువులా మారింది. భారీ వరదల నేపథ్యంలో రైళ్ల సర్వీసులూ క్యాన్సిల్ అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం మిచాంగ్ తుఫాను తీరాన్ని తాకనుండటంతో సోమవారం అర్ధరాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 2015లో ముంచెత్తిన భారీ వరదలను గుర్తుచేసుకుని ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు చెబుతూ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని, ఇండ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.
పవర్, ఇంటర్నెట్ కట్.. ట్రాన్స్‌పోర్ట్‌పై ఎఫెక్ట్
చెన్నై, కాంచీపురం, చెంగలపట్టు, తిరువల్లూర్, నాగపట్టిణం, కడ్డలూరు తదితర జిల్లాల్లో వర్షాల ధాటికి జన జీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలాచోట్ల పవర్, ఇంటర్నెట్ కట్ అయ్యాయి. చెన్నైలోని పెరుంగుడిలో ఆదివారం నుంచి సోమవారం వరకు అత్యధికంగా 29 సెం.మీ. వర్షం కురిసింది. తిరువల్లూర్‌లోని అవదిలో 28 సెం.మీ., చెంగల్‌పేట్‌లోని మమల్లపురంలో 22 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. కొన్ని చోట్ల నడుము లోతు నీళ్లు చేరాయి. 14 సబ్‌వేలను క్లోజ్ చేశారు. వరద పోటెత్తడంతో కార్లు కొట్టుకుపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి. గతంలో వరదల వల్ల తలెత్తిన ఇబ్బందులను గుర్తుచేసుకుంటున్న జనం.. నిత్యావసరాలను తెచ్చుకుంటున్నారు.
121 షెల్టర్లు, 5 వేల రిలీఫ్ సెంటర్లు
వరద బాధితుల కోసం 121 షెల్టర్లు, 5 వేల రిలీఫ్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని 685 మందిని 11 క్యాంపులకు తరలించారు. చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, సుబ్రమణియన్ పర్యటించారు. రెస్క్యూ ఆపరేషన్లలో 10 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ నిమగ్నమయ్యాయి. 11 ప్రాంతాల్లో కుప్పకూలిన చెట్లను తొలగించారు. వేలచేరిలో కొంత భూమి కొట్టుకుపోయింది. దీంతో అక్కడ లోతైన గొయ్యి ఏర్పడింది. అక్కడ కొంతమంది చిక్కుకోగా.. వారిని కాపాడేందుకు రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. అదే ప్రాంతంలో ఓ బిల్డింగ్‌లో కొంతమంది కార్మికులు చిక్కుకుపోగా.. ఇద్దరిని పోలీసులు కాపాడారు. మిగతా వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీగా నీళ్లు నిలిచిన ఓ చోట కొందరు ఈత కొట్టడం కనిపించింది.
ఇయ్యాల పబ్లిక్ హాలిడే
మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. చెన్నై, తిరువల్లూర్, కాంచీపురం, చెంగలపట్టు జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ– ప్రైవేటు ఆఫీసులకు సెలవు ప్రకటించింది. పోలీసు, లోకల్ బాడీస్, పాల సప్లై, వాటర్ సప్లై, హాస్పిటళ్లు, మెడికల్ షాపులు కొనసాగను న్నాయి. ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించాలని ప్రైవేటు సంస్థలను ఆదేశించింది.
ప్రజలకు ప్రభుత్వం అడ్వైజరీ
ప్రజలు ఇండ్లలోనే ఉండాలని, ఉద్యోగులు ఇండ్ల నుంచి పని చేయాలని ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. డోర్లు, కిటికీలు మూసి ఉంచాలని కోరింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని చెప్పింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, వస్తువులకు నీళ్లు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించింది. ఆహార పదార్థాలు, నీళ్లు, మందులు వంటి వాటిని ఉంచుకోవాలని చెప్పింది. అగ్గిపెట్టెలు, లైట్లు, బ్యాటరీలు, డ్రైఫుడ్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను వెంట ఉంచుకోవాలని కోరింది. 6వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.
నేడు నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
‘మిచాంగ్’ తుఫాను మంగళవారం ఉదయం ఏపీలోని మచిలీపట్నం- నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, గాలులు వేగంగా వీస్తాయని ఆఫీసర్లు చెప్పారు. ఒడిశాలోని ఐదు జిల్లాలు మల్కాన్‌గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, గంజంలోనూ అలర్ట్ ప్రకటించారు.
చెరువులా మారిన చెన్నై ఎయిర్‌పోర్టు
నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో చెన్నై ఎయిర్‌పోర్టును సోమవారం ఉదయం 9.40 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు మూసేశారు. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించాల్సిన 70 విమాన సర్వీసులను రద్దు చేశారు. 12 డొమెస్టిక్, 4 ఇంటర్నేషనల్ సర్వీసులను క్యాన్సిల్ చేశారు. మూడు విమానాలను బెంగళూరుకు డైవర్ట్ చేశారు. నీళ్లు నిలిచిపోవడంతో రన్‌వే, ఇతర రోడ్లను మూసేసినట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ వెల్లడించింది. రెండు మూడు అడుగుల లోతులో విమానాలు నిలిచి ఉండటం పలు వీడియోల్లో కనిపించింది. మరోవైపు, పలు ట్రైన్ సర్వీసులు కూడా రద్దయ్యాయి. కొన్ని రైళ్లు చాలా ఆలస్యంగా నడిచాయి.
రోడ్డుపై మొసలి కలకలం..
చెన్నై : సబర్బన్ పెరుంగులాథూర్ ఏరియాలో ఓ మొసలి రోడ్డు దాటుతున్న వీడియోపై అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియా సాహు స్పందించారు. ‘‘ఈ వీడియోను చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. చెన్నైలోని చాలా వాటర్ బాడీస్‌లో కొన్ని మొసళ్లు ఉన్నాయి. ఇవి ప్రమాదకర జంతువులు.. వాటికి దూరంగా ఉండండి. వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు వంటి వాటర్ బాడీస్ ఉప్పొంగడంతో ఇవి కొట్టుకొచ్చి ఉంటాయి. దయచేసి వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్లొద్దు” అని పేర్కొన్నారు. ఈ జంతువులను ఒంటరిగా, రెచ్చగొట్టకుండా వదిలేస్తే మనుషులకు ఎలాంటి హాని కలిగించవని,
భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాం: స్టాలిన్
చెన్నై : మిచాంగ్ తుఫాను కారణంగా సాధా రణ జనజీవనం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకుంటున్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలీసులు, ఫైర్ తదితర శాఖల సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు. గ్రేటర్ చెన్నై, తంబారం, అవది కార్పొరేషన్లలో రిలీఫ్ చర్యలను పర్యవేక్షించేందుకు ఐఏఎస్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు.