
తుఫాన్ మిచాంగ్.. తీరం దాటింది. ఏపీలోని చీరాల, బాపట్ల మధ్య.. ఇది తీరం దాటింది. తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి.. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. కరెంట్ సరఫరా నిలిచింది. తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ఉన్న గ్రామాల్లోని పూరిళ్లు కూలిపోయాయి. తీరం సమీపంలో.. రోడ్లపై ఉన్న చిన్న తాత్కాలిక దుకాణాలు ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వందల సంఖ్యలో రైలు సర్వీసులను రద్దు చేశారు అధికారులు.
AP CM @YSJagan’s Government leads with exemplary measures as Cyclone Michaung approaches, ensuring the best possible relief efforts. #CycloneReliefMeasuresInAP pic.twitter.com/v4FfYbHX2E
— Anil Kumar (@AnilKum537) December 5, 2023
మచిలీపట్నం నుంచి చెన్నై వరకు సముద్రం 30 మీటర్లు ముందుకు వచ్చింది. 2023, డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో నెల్లూరు, కావలి మధ్య తీరాన్ని తాకిన మిచాంగ్ తుఫాన్.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాపట్ల, చీరాల మధ్య తీరాన్ని దాటింది. తీరం దాటిన సమయంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు తీవ్ర నష్టం వచ్చింది.
తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనూ తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. ఏపీలోని 10 జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. రాబోయే 24 గంటలు అంటే.. డిసెంబర్ 6వ తేదీ రాత్రి వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని.. అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.