తుఫాన్ మిధిలీ భీకరంగా మారుతుంది. ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో.. ఏపీలోని విశాఖపట్నం సముద్ర తీరానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ.. ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు ప్రయాణిస్తుంది. నవంబర్ 16వ తేదీ తెల్లవారుజామున వాతావరణ శాఖ ప్రకటించిన వివరాలు ఆధారంగా.. ఇది 18వ తేదీ నాటికి తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.
నవంబర్ 17వ నాటికి ఇది తీవ్ర తుఫాన్ గా మారుతుందని.. 24 గంటలపాటు ఇది అత్యంత తీవ్ర తుఫాన్ గా మారుతుందని.. ఆ తర్వాత తీవ్రత తగ్గి.. తీరం దాటే సమయంలో తుఫాన్ గా మారనున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం సముద్ర తీరానికి 380 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో.. రాబోయే 24 గంటల్లో ఇది దిశ మార్చుకునే అవకాశాలనూ కొట్టిపారేయలేం అంటున్నారు అధికారులు.
మిధిలీ తుఫాన్ ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని.. తెలంగాణకు తుఫాన్ ముప్పు లేదని.. కాకపోతే అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు, మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ.
మిధిలీ తుఫాన్ ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వైపు వెళుతుందని.. ఏపీకి తుఫాన్ ముప్పు లేదని తెలిపింది వాతావరణ శాఖ. అయితే భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో.. మత్స్యకారులు రెండు రోజులు అంటే నవంబర్ 18వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు చేసింది. తీరం దాటే సమయంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
ఇటీవలే బంగ్లాదేశ్ లో ఓ తుఫాన్ తీరం దాటి తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఇంతలోనే మరో తుఫాన్ గండం బంగ్లాదేశ్ కు పొంచి ఉండటంతో.. ఆ దేశ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Also Read :- 25 సంవత్సరాల ముందే ఎలా: మళ్లీ తిరిగి భూమిపైకి వచ్చిన చంద్రయాన్ 3 రాకెట్..